Mukhesh Ambani: ముఖేశ్ అంబానీ దాతృత్వం.. మహారాష్ట్రకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా!

  • కరోనాతో విలవిల్లాడుతున్న మహారాష్ట్ర
  • ఆక్సిజన్ కొరతతో బాధ పడుతున్న పేషెంట్లు
  • 100 టన్నుల ఆక్సిజన్ ను పంపనున్న రిలయన్స్
Mukhesh Ambani to send oxygen to Maharashtra

కరోనా రక్కసి కోరలు చాస్తున్న తరుణంలో మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మహమ్మారి బారిన పడిన వారికి ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తమ చమురుశుద్ధి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు నిర్ణయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ప్లాంటును రిలయన్స్ నిర్వహిస్తోంది. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న తమ రిఫైనరీలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ ను మహారాష్ట్రకు ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.

ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే రిలయన్స్ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు వస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆసుపత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. ఆక్సిజన్ సరిపోక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా కట్టడి కోసం మహా ప్రభుత్వం జనతా కర్ఫ్యూ కూడా విధించింది.

More Telugu News