Corona Virus: ఛత్తీస్ గఢ్ ఆసుపత్రుల్లో కరోనా మరణమృదంగం... పేరుకుపోతున్న మృతదేహాలు!

  • ఎండలోనే మృతదేహాలు
  • శవాలను దాచలేకపోతున్నామంటున్న వైద్య వర్గాలు
  • రోజుకు 55 మృతదేహాలకు అంత్యక్రియలు
Chattisghad Hospitals Pile with Dead Bodies

పెరుగుతున్న కరోనా కేసులు ఛత్తీస్ గఢ్ లో మరణమృదంగాన్నే సృష్టిస్తున్నాయి. రాయ్ పూర్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి సహా, పలు పట్టణాల్లోని ఆసుపత్రులలో  శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. పలు మృతదేహాలను దాచే పరిస్థితులు లేక ఎండలో వాటిని ఉంచడాన్ని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. కరోనా రెండో వేవ్ సమయంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోందని, శవాలను దాచేందుకు కూడా అవసరమైన వసతులు లేవని డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ మెమోరియల్ హాస్పిటల్ వైద్యాధికారులు వెల్లడించారు.

మృతదేహాలను ఉంచేందుకు సరిపడినన్ని ఫ్రీజర్ బాక్స్ లు లేవని, అందుకే వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఉంచాల్సి వస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోతున్నామని, కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబీకులు మృతదేహాలను తీసుకుని వెళ్లడం లేదని వాపోయారు. గడచిన వారం రోజులుగా ఆసుపత్రిలోని ఆక్సిజన్ బెడ్లు 100 శాతం నిండిపోయి ఉన్నాయని, కొత్తగా ఆక్సిజన్ అవసరమైన వారికి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు.

 "కరోనా మరణాలు ఈ స్థాయిలో ఉంటాయని మేము ఎంతమాత్రమూ ఊహించలేదు. సాధారణ పరిస్థితుల్లో రోజుకు ఒకరు, లేదా ఇద్దరు మరణిస్తుంటారు. ఆ సంఖ్య 10 నుంచి 20కి చేరేసరికి ఆ మేరకు ఏర్పాట్లు చేశాం. కానీ ఇప్పుడు రోజుకు 50 నుంచి 60 మంది కన్నుమూస్తున్నారు. మేము ఫ్రీజర్లను ఎక్కడి నుంచి తేగలం?" అని రాయ్ పూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మీరా భాగెల్ వ్యాఖ్యానించారు.

కరోనాపై విజయం సాధిస్తున్నామన్న సమయం వచ్చిందని భావించిన వేళ, రెండో వేవ్ వచ్చేసిందని, అయితే, హోమ్ ఐసొలేషన్ వంటి సదుపాయాలు పెరిగాయని, అత్యధిక కేసుల్లో ఎటువంటి లక్షణాలూ ఉండటం లేదని, లక్షణాలున్న వారు గుండెపోటుతో మరణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కాగా, ఒక్క రాయ్ పూర్ లో సరాసరిన రోజుకు 55 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుండటం గమనార్హం.

More Telugu News