Hyderabad: మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తున్న తెలంగాణ పోలీసులు!

  • కరోనాపై అశ్రద్ధ చూపుతున్న ప్రజలు
  • రోజుకు రెండు ప్రాంతాల్లో పోలీసుల డ్రైవ్
  • ఆన్ లైన్ లో జరిమానా విధిస్తున్న పోలీసులు
  • చెల్లించకుంటే కోర్టుకే
No Mask 1000 Fine in Telangana

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, ప్రజలు అశ్రద్ధ చూపుతుంటే, పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటిస్తేనే మహమ్మరాని అడ్డుకోగలమని ఇప్పటికే వారం రోజుల పాటు ప్రచారం చేసిన హైదరాబాద్ పోలీసులు, ఇప్పుడిక మాస్క ధరించకుండా కనిపిస్తే, రూ. 1000 జరిమానాగా విధిస్తున్నారు. నిత్యమూ ఒక్కో పోలీసు స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ, మాస్క్ లు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

మాస్క్ లేకుండా తిరిగేవారి చిత్రాలను సేకరిస్తూ, వారికి ఆన్ లైన్ మాధ్యమంగా జరిమానా రసీదును ఇస్తున్నామని, జరిమానా చెల్లించకుంటే, డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టంలోని సెక్షన్ 51 (ఏ) కింద వారిని కోర్టులో హాజరు పరుస్తామని స్పష్టం చేశారు. వారిపై వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ప్రతి రోజూ కనీసం రెండు వేరువేరు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్టు తెలిపిన అధికారులు, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు జరుగుతున్నాయన్నారు.

ఆరోగ్య శాఖ అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా, ప్రజలు లెక్క చేయడం లేదని తమ తనిఖీల్లో తేలిందని అంటున్న పోలీసులు, వాహనాలపై వెళుతున్న వారు కూడా మాస్క్ లను ధరించడం లేదని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలతో ఉంటేనే కరోనాను కట్టడి చేయగలమని, ప్రజలు సహకరించాలని కోరారు.

More Telugu News