Harish Rao: డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా... విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి: హరీశ్ రావు

  • ప్రాజెక్టు అంచనాలు, వ్యయంపై విపక్షాల విమర్శలు
  • అసెంబ్లీలో హరీశ్ రావు ప్రసంగం
  • విపక్షాలకు దీటుగా బదులిచ్చే ప్రయత్నం
  • గణాంకాలతో సహా పలు ప్రాజెక్టుల వివరాలు వెల్లడి
Harish Rao condemns opposition parties claims

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీశ్ రావు ప్రసంగిస్తూ విపక్షాలపై మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల డీపీఆర్ లను కేంద్రానికి సమర్పించలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసలు, డీపీఆర్ లు ఇవ్వకుండానే ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. డీపీఆర్ లు సమర్పించకుండానే పర్యావరణ అనుమతులు వస్తాయా? అని అడిగారు. పలు విభాగాల కార్యదర్శులు ఉండే టీఏసీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు.

"విపక్ష నేతలు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమవుతుందని భావిస్తూ అసత్య ప్రచారం చేయడం బాధాకరం. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, అంచనాలు తప్పాయని అంటున్నారు. 1954లో రూ.122 కోట్లతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి సాగర్ ప్రాజెక్టు విలువ రూ.1,183 కోట్లు. 8.7 రెట్లు వ్యయం పెరిగింది. 1964లో రూ.40 కోట్లతో ప్రారంభమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి దాని వ్యయం రూ.4,300 కోట్లకు చేరింది. 106 రెట్లు వ్యయం పెరిగింది. జూరాల ప్రాజెక్టు 1980లో రూ.70 కోట్లతో ప్రారంభమైంది. పూర్తయ్యేనాటికి దాని వ్యయం రూ.1,815 కోట్లు. దీని వ్యయం 25 రెట్లు పెరిగింది" అని వివరించారు.

కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంచనాలు పెరిగితే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అంచనాలు పెంచిందని ప్రశ్నించారు. అంచనాలు పెంచుతూ వరుసగా జీవోలు ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు.

More Telugu News