YS Sharmila: విద్యార్థులతో షర్మిల భేటీ.. మీ అక్కగా సమాజాన్ని మార్చేందుకు యత్నిస్తున్నానని వ్యాఖ్య!

  • వివిధ యూనివర్శిటీల విద్యార్థులతో షర్మిల భేటీ
  • దాదాపు 350 మంది విద్యార్థులు హాజరు
  • తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదన్న షర్మిల
YS Sharmila meets with 350 students

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న వైయస్ షర్మిల వరుస సమావేశాలతో దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే దివంగత వైయస్ అభిమానులతో ఆమె జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహించారు. ఇదే సమయంలో మరోవైపు పలువురు నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆమెను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం పార్టీని నిర్మించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. మరోవైపు యువతపై షర్మిల దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో ఈరోజు షర్మిల సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 350 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా విద్యార్థులతో షర్మిల మాట్లాడుతూ, తెలుగు ప్రజలను దివంగత వైయస్సార్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు. ఆయన హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా వెయ్యి రూపాయలు కడితే, మిగతా ఫీజును ప్రభుత్వం భరించేదని చెప్పారు. అప్పుడు చదువుకున్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. వారంతా వైయస్సార్ ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని చెప్పారు.

ప్రతి జిల్లాకు యూనివర్శిటీని తీసుకొచ్చిన ఘనత వైయస్సార్ దేనని షర్మిల అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని... ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అందరి నిరీక్షణ ఫలించాలంటే మంచి సమాజం రావాల్సి ఉందని అన్నారు. మీ అక్కగా ఈ సమాజాన్ని బాగు చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

మరోవైపు మాజీ మంత్రి ప్రభాకర్ రెడ్డి కూడా షర్మిల పార్టీలో చేరబోతున్నారు. ఇటీవల షర్మిలను కలిసి సంఘీభావం ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి నిన్న ప్రభాకర్ రెడ్డిని కలిశారు. షర్మిల సమీప బంధువు కూడా ఈ సందర్భంగా వారితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా షర్మిలకు సహకారాన్ని అందించేందుకు ప్రభాకర్ రెడ్డి ఒప్పుకున్నారు. రెండు రోజుల్లో షర్మిలను ఆయన కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టి.అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆర్థిక, హోం శాఖల బాధ్యతలను నిర్వహించారు. పీవీ నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడు రవాణాశాఖ మంత్రిగా పని చేశారు.

More Telugu News