Amit Shah: అమిత్ షాతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు.. భేటీ వివరాలు!

  • 20 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం
  • ఆలయాలపై దాడులు, టీడీపీ నేతలపై కేసులపై చర్చలు
  • ఆధారాలను అందించామన్న టీడీపీ ఎంపీలు
TDP MPs meets Amit Shah

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అమిత్ షాను కలిసిన వారిలో గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతలు కుప్పకూలిన విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తమ సీనియర్ నేత అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా వివరించామని చెప్పారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారనే విషయాన్ని తెలిపామని అన్నారు.

కనకమేడల మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా ప్రతిపక్ష నేతలు, మీడియాపై కేసులు పెడుతున్నారనే విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వీటిపై విచారణ జరపాలని కోరామని తెలిపారు. వీటికి సంబంధించిన ఆధారాలను ఆయనకు అందించామని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోబోమనే అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేశారని అన్నారు.

More Telugu News