Bihar: ఆందోళనలకు దిగేవారికి ఇక ఉద్యోగాలు రావు.. బీహార్ ప్రభుత్వం వార్నింగ్!

  • సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లబ్ది అందబోదు
  • ఉద్యోగులకు కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వబోము
  • నితీశ్ సర్కారు నిర్ణయంపై సర్వత్ర విమర్శలు
No Jobs for Protesters says Bihar Govt

బీహార్ లో ఆందోళనలలో పాల్గొంటే ఇక వారికి ప్రభుత్వ ఉద్యోగాలు హుళక్కే. రాష్ట్రంలో ఆందోళనలకు దిగే వారికి ఇకపై ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళనలు చేసేవారు రిస్క్ లో పడతారని, విదేశాలకు వెళ్లాలని భావించే వారికి పాస్ పోర్టు కూడా లభించదని, ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలకు దిగితే, వారికి కాండక్ట్ సర్టిఫికెట్ రాదని స్పష్టం చేసింది.

నితీశ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. విపక్ష నేత తేజస్వీ యాదవ్, ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచి వేస్తున్నారని మండిపడ్డారు. నితీశ్ ముస్సోలిని, హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, 40 సీట్లు మాత్రమే సాధించి పీఠాన్ని అధిష్టించిన ఓ వ్యక్తికి ఎంత భయంగా ఉందోనని నిప్పులు చెరిగారు.

కాగా, ఈ నెల 1న ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేస్తూ, రాష్ట్రంలోని వారిలో ఎవరైనా ఆందోళనలు, నిరసనలు చేస్తే, వారిపై పోలీసు చర్యలు తప్పబోవని హెచ్చరించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందబోవని, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని స్పష్టం చేసింది.

More Telugu News