Farmer: ఇదో తరహా నిరసన.. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్ ను రివర్స్ గేర్ లో నడిపిన రైతు!

  • వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలు
  • రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీకి సన్నాహాలు
  • బర్నాలా నుంచి రివర్స్ గేర్ లో వచ్చిన గురుచరణ్ సింగ్
  • మెడ, కాళ్లు విపరీతంగా బాధిస్తున్నాయని వెల్లడి
Punjab farmer drove his tractor in reverse gaear

గత కొన్నివారాలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో నిరసనలు తెలుపుతున్న రైతులు రేపు రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీకి సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు పంజాబ్ కు చెందిన ఓ రైతు వినూత్నరీతిలో ఢిల్లీ చేరుకున్నాడు. గురుచరణ్ సింగ్ అనే ఈ రైతు పంజాబ్ లోని బర్నాలా నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వరకు ట్రాక్టర్ ను రివర్స్ గేర్ లో నడుపుకుంటూ వచ్చాడు. తాను రివర్స్ గేర్ లో రావడానికి గల కారణం వివరిస్తూ.... కేంద్రం కూడా నూతన వ్యవసాయ చట్టాలను రివర్స్ చేయాలని కోరుతూ ఈ విధంగా వచ్చానని వివరించాడు.

అయితే, రోడ్డుపై ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించని రీతిలో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేశానని గురుచరణ్ సింగ్ తెలిపాడు. రివర్స్ గేర్ లో వచ్చేటప్పుడు అదేపనిగా వెనక్కి తిరిగి చూడాల్సి వచ్చిందని, దాంతో తన మెడ, కాళ్లు బాగా బాధించాయని వెల్లడించాడు. గురుచరణ్ సింగ్ ఢిల్లీలో రైతు నిరసనల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. గత డిసెంబరులో పంజాబ్ నుంచి కారులో వచ్చి రైతు ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. ఇప్పుడదే రైతు ట్రాక్టర్ లో రివర్స్ గేర్ లో వచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది.

More Telugu News