Farmers: 2024 మే వరకు నిరసనలు తెలిపేందుకు సిద్ధమన్న రైతులు... మొండి పట్టుదల వీడాలన్న కేంద్రం

  • వ్యవసాయ చట్టాలపై వీడని ప్రతిష్టంభన
  • సాగు చట్టాలు తొలగించాలని రైతుల పట్టు
  • కుదరదంటూ కేంద్రం స్పష్టీకరణ
  • ఈ నెల 19న మరో దఫా చర్చలు
Farmers says they will continue protests till next elections

జాతీయ వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగిపోయే సూచనలు కనిపించడంలేదు. ఇప్పటివరకు 9 పర్యాయాలు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగినా ప్రయోజనం శూన్యం. ఇరుపక్షాల్లో ఎవరూ మెట్టు దిగకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. ఈ నెల 19న మరోసారి సమావేశమవ్వాలని కేంద్రం, రైతు సంఘాలు నిర్ణయించాయి.

ఈ నేపథ్యంలో రైతులు స్పందిస్తూ, తాము 2024 మే వరకు నిరసనలు తెలిపేందుకైనా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్నే తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. దేశంలో తదుపరి లోక్ సభ ఎన్నికలు 2024 వేసవిలో జరిగే అవకాశం ఉంది. కాగా, రైతులు తాజాగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బదులిచ్చారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే మొండి పట్టుదలను రైతులు విడనాడాలని హితవు పలికారు. అంశాలవారీగా సమస్యల పరిష్కారం కోసం చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ తప్ప ఇతర అంశాల పరిష్కారం కోసం కేంద్రం సుముఖంగా ఉందని తోమర్ వెల్లడించారు. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించేందుకు కేంద్రం తెరిచిన హృదయంతో సంసిద్ధంగా ఉందని తెలిపారు.

More Telugu News