IMA: ఆయుర్వేద వైద్యులకు సర్జరీలకు అనుమతిపై సుప్రీంలో ఐఎంఏ పిటిషన్

  • సవరణలు, రూల్స్ ను పక్కనపెట్టేలా నోటీసులివ్వండి
  • ఆధునిక వైద్యం సిలబస్ ను చేర్చే అధికారం లేదని ఆదేశించండి
  • 40 రకాల ఆపరేషన్లు చేసేలా ఇటీవలే కేంద్రం నోటిఫికేషన్
IMA moves Supreme Court on allowing Ayurvedic doctors to perform surgeries

కొన్ని రకాల శస్త్ర చికిత్సలు చేసేలా ఆయుర్వేద డాక్టర్లకు అవకాశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శనివారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జనరల్ సర్జరీలు చేసేందుకు పీజీ ఆయుర్వేద స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇవ్వాలన్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (సీసీఐఎం) నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద సర్జరీ నిబంధనలు, సవరణలను కొట్టేయండి. లేదా పక్కనపెట్టేలా ఆదేశాలివ్వండి. ఆధునిక వైద్య సిలబస్ ను ఆయుర్వేదంలో చేర్చే అధికారాలు సీసీఐఎంకు లేవని ప్రకటించండి’’ అని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ పిటిషన్ లో పేర్కొన్నారు.
   
ఆయుర్వేద పీజీ డాక్టర్లు ఎముకలు, కంటి, ఈఎన్ టీ, దంత శస్త్రచికిత్సలు సహా దాదాపు 40 ఆపరేషన్లను చేసేలా నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందుకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద ఎడ్యుకేషన్) రెగ్యులేషన్స్ 2016లో సీసీఐఎం సవరణలు కూడా చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా అలోపతి డాక్టర్లు ఆందోళనలు చేశారు.

రాబోయే రోజుల్లో ఆయుష్ (ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి) వైద్య విధానాలను ఆధునిక వైద్య విధానాలతో అనుసంధానించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐఎంఏ ముందు నుంచీ వ్యతిరేకిస్తోంది. దీని వల్ల కిచిడీ మెడికల్ సిస్టమ్ తయారవుతుందని, హైబ్రిడ్ డాక్టర్లు పుట్టుకొస్తారని ఐఎంఏ ప్రెసిడెంట్ విమర్శలు కూడా చేశారు.

More Telugu News