Supreme Court: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • ఢిల్లీ, గుజరాత్ లపై సుప్రీంకోర్టు అసహనం
  • డిసెంబర్ లో కరోనా విజృంభిస్తుందన్న సుప్రీం
  • ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశం
Supreme Court issues new orders to states amid rise in Corona cases

దేశంలోని పలు నగరాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డిసెంబర్ లో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారక ముందే జాగ్రత్త పడాలని సూచించింది.

ఇతర రాష్ట్రాలకు కూడా ఇవే ఆదేశాలను జారీ చేసింది. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయాన్ని, సహకారాన్ని కోరుకుంటున్నాయో కూడా నివేదికలో పేర్కొనాలని తెలిపింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. కరోనాపై పూర్తి స్థాయిలో యుద్ధం చేయకపోతే... డిసెంబర్ లో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.

గుజరాత్, ఢిల్లీ, అసోం, మహారాష్ట్ర రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 44,059 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 91 లక్షలను దాటింది. త్వరలోనే సెకండ్ వేవ్ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News