Arnab Goswami: జైలు నుంచి విడుదలైన అర్నాబ్ గోస్వామి.. రోడ్‌షో!

  • ఇంటీరియర్ డిజైనర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఆరోపణలు
  •  తలోజా జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఆయన అభిమానులు
  • 8 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల
Republic TV Promoter Arnab Goswami released from jail

రిపబ్లిక్ టీవీ ప్రమోటర్ అర్నాబ్ గోస్వామి జైలు నుంచి విడుదలయ్యారు. తక్షణం ఆయనను విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు అర్నాబ్‌ను విడుదల చేశారు. విషయం తెలుసుకున్న అర్నాబ్ మద్దతుదారులు తలోజా జైలు వద్దకు చేరుకున్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కొద్దిదూరం రోడ్ షో నిర్వహించారు. ఓ ఇంటీరియర్ డిజైనర్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించారన్న ఆరోపణలపై అర్నాబ్ అరెస్ట్ అయ్యారు.


ఈ కేసును గత ప్రభుత్వం మూసివేసినప్పటికీ బాధిత కుటుంబం అభ్యర్థనతో ప్రభుత్వం మళ్లీ తెరిచింది. ఈ కేసులో అర్నాబ్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా మధ్యంతర బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. 


దీంతో అర్నాబ్ సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన   జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం రూ. 50 వేల ష్యూరిటీతో బెయిలు మంజూరు చేయాలని ఆదేశించింది. ఆదేశాలను తక్షణం అమలు చేయాలని ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఫలితంగా అరెస్ట్ అయిన 8 రోజుల తర్వాత అర్నాబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. 

More Telugu News