Cyanide Mohan: కర్ణాటకలో సంచలనం సృష్టించిన 'సైనైడ్ మోహన్' ఉదంతం... 20వ కేసులోనూ దోషిగా తేలాడు!

  • పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల
  • కోరిక తీరాక సైనైడ్ పూసిన మాత్రలతో హత్యలు
  • నగలు, నగదుతో ఉడాయింపు
Cyanide Mohan convicted in his last murder case

కర్ణాటకలో కొన్నాళ్ల కిందట వరుసగా మహిళల హత్యలు జరగడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు... 20 హత్యలు జరిగాయి. అన్నింట్లోనూ మరణానికి కారణం సైనైడ్ అని తేల్చారు. పెళ్లి పేరిట వారితో లైంగిక సుఖం పొందడం, ఆపై హత్య చేయడం... ఇలా పదుల సంఖ్యలో ఘాతుకాలు జరిగాయి.  ఈ హత్యలన్నీ చేసింది ఒక్కడేనని పోలీసులు తేల్చడమే కాదు హంతకుడ్ని అరెస్ట్ చేసి కోర్టు బోనులో నిలబెట్టారు. అతడి పేరు మోహన్ కుమార్. వృత్తిరీత్యా ఓ డ్రిల్ మాస్టారు. కానీ అతడిలోని పైశాచిక ప్రవృత్తి హత్యలకు పురికొల్పింది. ఇప్పటికే అతడిపై అనేక కేసుల్లో మరణశిక్షలు పడ్డాయి. తాజాగా అతడి చివరి కేసైన 20వ హత్య కేసులోనూ దోషిగా తేలాడు. ఈ నెల 24న శిక్ష ప్రకటించనున్నారు.

అనేకమంది యువతులను పెళ్లిపేరుతో నమ్మించి కడతేర్చిన 'సైనైడ్ మోహన్' చివరిగా 2009 జూన్ 8న కేరళకు చెందిన పాతికేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోరిక తీరిన తర్వాత సైనైడ్ తో అంతమొందించాడు. బెంగళూరులోని ఓ లాడ్జీలో శారీరకంగా కలిసిన తర్వాత బస్టాండు వద్ద ఆమెకు గర్భనిరోధక మాత్ర అంటూ సైనైడ్ పూసిన మాత్ర ఇచ్చాడు. ఆ మాత్ర వేసుకోవడంతోనే ఆ అభాగ్యురాలి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లాడ్జీలో ఉన్న ఆమె నగలను తీసుకుని మోహన్ కుమార్ ఉడాయించాడు.

దాదాపు అతను చేసిన ప్రతి హత్య కూడా ఇదే తరహాలో సాగినట్టు పోలీసులు గుర్తించారు. యువతులను పెళ్లి పేరుతో మభ్యపెట్టడం, వారితో తన వాంఛలు తీర్చుకున్నాక హత్యచేసి వారి నగలు, నగదు చేజిక్కించుకోవడం... ఇలా ఏళ్లపాటు సాగింది. 2005 నుంచి 2009 మధ్య కాలంలో ఈ దారుణాలు జరిగాయి. 2009లో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపితే నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడించాడు. కాగా, 'సైనైడ్ మోహన్' కు ఐదు కేసుల్లో మరణశిక్ష విధించారు. మరో మూడు కేసుల్లో జీవితఖైదు పడింది. రెండు కేసుల్లో మరణశిక్షలను ఆపై జీవితఖైదుగా మార్చారు.

More Telugu News