Chandrababu: ఇది తమిళనాడులో చిక్కుకున్న ఏపీ కూలీల ఆవేదన... అంటూ వీడియో పోస్టు చేసిన చంద్రబాబు

  • ఏపీలో ఇసుక లేక పొరుగురాష్ట్రం వెళ్లామన్న కూలీలు
  • 30 రోజులుగా అష్టకష్టాలు పడుతున్నట్టు వెల్లడి
  • వీళ్లకేం సమాధానం చెబుతారు? అంటూ సీఎంను ప్రశ్నించిన చంద్రబాబు
Chandrababu tweets a video of migrants in Tamilnadu

కరోనా వైరస్ భూతాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో వలస కూలీల పరిస్థితి దుర్భరంగా తయారైంది. పొట్టచేతపట్టుకుని తమిళనాడు వలసవెళ్లిన ఏపీ కార్మికులు కూడా అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో పంచుకున్నారు. ఏపీలో ఇసుక అందుబాటులో లేక, పనులు జరగక తాము పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లామని ఓ వ్యక్తి ఆ వీడియోలో వివరించాడు.

గత 30 రోజులుగా పనుల్లేక, తిండిలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపాడు. రెండు కిలోల బియ్యం ఇస్తామంటే రెండు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి పడిగాపులు కాస్తున్నామని, మధ్యాహ్నం రెండు గంటలైనా ఇవ్వలేదని పేర్కొన్నాడు. సీఎం జగన్ తమకు బియ్యం, డబ్బులు ఇవ్వనవసరం లేదని, తాము ఊరికి వెళ్లేందుకు అనుమతి ఇప్పిస్తే చాలని, వస్తువులు అమ్ముకునైనా చార్జీలు పెట్టుకుని ఊరికి వెళ్లిపోతామని ఆ వ్యక్తి వివరించాడు.

సీఎం జగన్ చెయ్యాల్సిందల్లా తమకు ఊరికి వెళ్లేందుకు అనుమతి మాత్రమేనని, ఏదో విధంగా సొంతూర్లకు వెళ్లిపోతామని ఆవేదనాభరిత స్వరంతో చెప్పాడు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, స్వగ్రామాలకు పంపిస్తే చాలని వేడుకుంటున్న వీళ్లకేం సమాధానం చెబుతారు? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.

More Telugu News