USA: తుపాకీ కిందపడేసి, చేతులు పైకెత్తిన యువకుడిని కాల్చి చంపిన అమెరికన్ పోలీస్... వీడియో!

  • అమెరికాలో ఘటన
  • తాగి బెదిరిస్తున్నాడని యువతి ఫిర్యాదు
  • ఆగకుండా ముందుకు వస్తున్నాడని కాల్చివేత

పోలీసులు ఆదేశించిన విధంగా తన చేతిలో ఉన్న తుపాకిని కిందపడేయడంతో పాటు, వారి సూచన మేరకు రెండు చేతులనూ పైకెత్తి ముందుకు నడుస్తున్న ఓ యువకుడిని అమెరికన్ పోలీసు ఒకరు ఐదుసార్లు తుపాకితో కాల్చిన వీడియో ఇప్పుడు తీవ్ర సంచలనం కలిగిస్తోంది. నిరాయుధుడైన యువకుడిని చంపేశారని ప్రజలు విమర్శిస్తుంటే, జరిగిన ఉదంతాన్ని వివరిస్తూ, పోలీసు అధికారి యూనిఫామ్ కు అమర్చివున్న వీడియోను విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే...

వాన్ బెర్మార్డినో ప్రాంతంలో నివశిస్తున్న 27 యువకుడు రిచర్డ్ సాంచెజ్ పై అతని బంధువు ఒకరు 911కు కాల్ చేసి, అతను మత్తులో ఉన్నాడని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చే వరకు ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. రిచర్డ్ చేతిలో గన్ ఉంది. అతనికి కొద్ది దూరంలో ఓ యువతి నిలబడివుంది. పోలీసులు గన్ కిందపడేయాలని మూడు సార్లు హెచ్చరించగా, రిచర్డ్ వారి ఆదేశాలను పాటించాడు. ఆపై పోలీసుల వైపు నడుస్తూ వచ్చాడు. రెండు చేతులూ పైకెత్తాలని పోలీసులు ఆదేశించగా, రెండు చేతులూ పైకెత్తి నడుస్తూ వచ్చాడు. అతన్ని ఆగాలని పోలీసులు సూచించినా, పట్టించుకోలేదు. కేవలం ఆగలేదన్న కారణంతో ఓ పోలీసు అధికారి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఐదు సార్లు అతని శరీరంలోకి బులెట్లు దించాడు.

కాల్పులు జరిపిన పోలీసు అధికారి సంయమనం పాటించి వుండాల్సిందని పోలీస్ చీఫ్ ఎరిక్ మెక్ బ్రైడ్ వ్యాఖ్యానించారు. అతన్ని విధుల నుంచి తొలగించామని, అతనిపై విచారణ జరుగుతోందని వెల్లడించారు.

More Telugu News