Donald Trump: ట్రంప్ తో సమావేశం విఫలమవడానికి కారకులట.. ఐదుగురు ఉన్నతాధికారులకు మరణశిక్ష అమలు చేయించిన కిమ్ జాంగ్ ఉన్!

  • కిమ్ తో పాటు హనోయ్ సమ్మిట్ లో పాల్గొన్న కిమ్ హయోక్ చౌల్
  • సుప్రీం లీడర్ ను మోసం చేశారన్న అభియోగాలు
  • మిరిమ్ ఎయిర్ పోర్టులో మరణశిక్ష అమలు
  • అనువాదకురాలికి జైలు శిక్ష

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన సమావేశం సత్ఫలితాలను ఇవ్వలేదన్న ఆగ్రహంతో, తన ప్రభుత్వంలోని ఐదుగురు సీనియర్ అధికారులకు మరణశిక్ష విధించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆ శిక్షను తాజాగా అమలు చేయించాడు. ఈ సంచలన వార్తను దక్షిణ కొరియా దినపత్రిక 'చోసున్' ఈ ఉదయం ప్రచురించింది.

అమెరికాకు ప్రత్యేక బృందంగా వెళ్లి వచ్చిన ఐదుగురికీ కిమ్ మరణశిక్షలను అమలు చేయించాడని పత్రిక పేర్కొంది. వీరిలో కిమ్ తో పాటు ప్రైవేటు రైల్లో వెళ్లి, ట్రంప్ తో సమావేశంలో అన్నీ తానైన కిమ్ హయోక్ చౌల్ కూడా ఉన్నారని, సుప్రీం లీడర్ ను మోసం చేశారన్న అభియోగాలను ఆయనపై మోపారని, కిమ్ ఆదేశాలతో ఫైరింగ్ స్క్వాడ్ ఆయన తలలో కాల్చి చంపిందని పత్రిక వెల్లడించింది. మిరిమ్ ఎయిర్ పోర్టులో అతనితో పాటు మరో నలుగురు దౌత్యాధికారులనూ కాల్చి చంపారని వెల్లడించింది. ఇతర అధికారుల పేర్లను మాత్రం పత్రిక వెల్లడించలేదు.

కాగా, ఫిబ్రవరిలో హనోయ్ సమ్మిట్ జరుగగా, యూఎస్ ప్రత్యేక ప్రతినిధి స్టీఫెన్ బైగున్ తో కలిసి కిమ్ హయోక్ చౌల్ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఈ కథనంపై అధికారికంగా స్పందించేందుకు సౌత్ కొరియా అధికారులు నిరాకరించారు. ఇక ఇదే సదస్సులో చిన్న తప్పు చేశారని కిమ్ జాంగ్ ఉన్ అనువాదకురాలు షిన్ హోయ్ యంగ్ ను జైలుకు పంపించారని కూడా పత్రిక వెల్లడించింది. కిమ్ కొత్త ప్రతిపాదనను ట్రంప్ కు ఆంగ్లంలో తర్జుమా చేసి చెప్పడంలో ఒక్క పదాన్ని తప్పుగా పలకడమే ఆమె చేసిన తప్పైంది. కొరియా అణు కార్యక్రమాల నిలిపివేతపై వియత్నాం రాజధానిలో జరిగిన ట్రంప్, కిమ్ ల భేటీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేకపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News