bandaru dattatreya: ఎన్నికల తర్వాత జగన్ ఎన్డీయే గూటికి చేరతారు: బండారు దత్తాత్రేయ జోస్యం

  • కేటీఆర్ లిస్టులో ఉన్నవాళ్లు ఎన్డీయేలోకే వస్తారు
  • టీడీపీ కూడా వచ్చే అవకాశం ఉంది
  • చంద్రబాబు దేశప్రజలకు క్షమాపణ చెప్పాలి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తాజా రాజకీయ పరిస్థితులపై వ్యాఖ్యానించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్ చేరేది ఎన్డీయే గూటికేనని స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ లో ఉంటాయని కేటీఆర్ చెబుతున్న పార్టీల్లో చాలావరకు ఎన్డీయేలో చేరతాయని అన్నారు. టీడీపీ కూడా ఎన్డీయే పక్షాన చేరే అవకాశం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సహా ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ పక్షాలకు ఎన్నికలు పూర్తయ్యాక ఎన్డీయేనే దిక్కు అని వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ దత్తన్న డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో 11 సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయంటున్న కేసీఆర్, ఒక్కసారైనా కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యారా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో ఒక్కరోజు కూడా మంత్రిగా సమాధానం చెప్పని వ్యక్తి, 11 సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయంటే నమ్మేదెవరు? అని అన్నారు. ఆయనకు సర్జికల్ దాడుల గురించి ఏం తెలుసని నిలదీశారు.

More Telugu News