physical copies: వాహనదారులకు మద్రాస్ హైకోర్టు శుభవార్త!

  • లైసెన్స్, ఇతర ధ్రువపత్రాల ఎలక్ట్రానిక్ కాపీలు ఉన్నా ఓకే
  • ఒరిజినల్స్ వెంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు
  • వాహనదారులకు అనుకూలంగా తీర్పు

వాహనదారులకు మద్రాస్ హైకోర్టు శుభవార్త చెప్పింది. ఇకపై వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. లైసెన్స్, ఇతర ధ్రువపత్రాలు ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నా సరిపోతుందని తేల్చి చెప్పింది. డ్రైవర్ తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాల్సిందేనని, ఒరిజినల్స్ వారితోనే ఉంచుకోవాలన్న ప్రభుత్వ మెమొరాండంకు వ్యతిరేకంగా దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.

లైసెన్స్ సహా  వాహనానికి సంబంధించిన ఇతర ధ్రువపత్రాలను డ్రైవర్లు వెంట ఉంచుకోవాలంటూ తమిళనాడు రాష్ట్ర ప్లానింగ్ సెల్ గతేడాది మెమొరాండం జారీ చేసింది. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 130, సెక్షన్ 171 ప్రకారం ఒరిజినల్స్‌ను వెంట ఉంచుకోవడం తప్పనిసరి అని పేర్కొంది.

అయితే, దీనిని వివిధ ట్రాన్స్‌పోర్ట్ బాడీలు తప్పుబట్టి ప్రభుత్వ ఆదేశాలను కోర్టులో సవాలు చేశాయి. తాజాగా, వీటిని విచారించిన జస్టిస్ డాక్టర్ వినీత్ కొఠారి, జస్టిస్ డాక్టర్ అనిత సుమంత్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఒరిజినల్స్‌ను వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదని, ఎలక్ట్రానిక్ కాపీలు ఉన్నా సరిపోతుందంటూ వాహనదారులకు అనుకూలంగా తీర్పు చెప్పింది.

More Telugu News