TRS: టీఆర్ఎస్ కారులో ఉన్నది ఐదు మంది మాత్రమే: రణ్ దీప్ సూర్జేవాలా

  • పోలీసు వాహనాల టెండర్లలో రూ. 3వేల కోట్ల అవినీతి జరిగింది
  • రాష్ట్రంలో అవినీతి, పైరవీలు, అక్రమాలు పెరిగిపోయాయి
  • కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 35వేల కోట్లను కాంట్రాక్టర్లు దోచుకున్నారు

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణను దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చేశారని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా విమర్శించారు. టీఆర్ఎస్ పాలనపై ఈరోజు ఆయన గాంధీభవన్ లో ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు వాహనాల టెండర్లలో కూడా రూ. 3వేల కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో అవినీతి, పైరవీలు, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. మిషన్ భగీరథ పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు.

కమిషన్ల కోసమే ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని రణ్ దీప్ దుయ్యబట్టారు. రూ. 62వేల కోట్లు ఖర్చు చేసినా... ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 35వేల కోట్లను కాంట్రాక్టర్లు దోచుకున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలకు అన్యాయం జరిగిందని చెప్పారు. టీఆర్ఎస్ కారులో కేసీఆర్ కుటుంబానికి చెందిన ఐదుగురు మాత్రమే ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని చెప్పారు. 

More Telugu News