me too: ‘మీ టూ’ కేవలం మూణ్ణాళ్ల ముచ్చటే.. లైంగిక వేధింపులు అన్నిచోట్లా ఉన్నాయి!: మోహన్ లాల్

  • ఆరోపణలు చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది
  • మలయాళ పరిశ్రమలో ఎలాంటి సమస్య లేదు
  • దుబాయ్ లో మీడియాతో మాట్లాడిన మోహన్ లాల్

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై మొదలైన మీటూ ఉద్యమం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం దెబ్బకు బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ ల జాతకాలు మారిపోయాయి. పలు కీలక ప్రాజెక్టులు వీరి నుంచి చేజారిపోయాయి. ఈ నేపథ్యంలో ‘మీ టూ’ వ్యవహారంపై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పందించారు. మీటూ ఉద్యమం మూణ్ణాళ్ల ముచ్చటేనని వ్యాఖ్యానించారు.

మలయాళ యాక్టర్స్‌ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోహన్ లాల్ దుబాయ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీటూ ఉద్యమంపై మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ..‘మలయాళ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యా లేదు. లైంగిక వేధింపులు అన్నవి ప్రతిచోటా ఉంటాయి. అవి కేవలం  సినీ పరిశ్రమలోనే ఉంటాయనుకోవడం కరెక్ట్ కాదు. అయినా మీటూ ఆరోపణలు చేయడమన్నది ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలాంటివి ఎక్కువకాలం నిలబడవు. మూణ్ణాళ్ల ముచ్చటగానే అవుతాయి’ అని తెలిపారు.

మీటూ ఉద్యమంపై వ్యక్తిగతంగా తాను కామెంట్ చేయబోనని మోహన్ లాల్ స్పష్టం చేశారు. మరోవైపు లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్ ఈ వేడుకలకు హాజరుకాబోడని తేల్చిచెప్పారు. అతను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మువీ ఆర్టిస్ట్స్(అమ్మ)లో సభ్యుడు కాదని వ్యాఖ్యానించారు.

More Telugu News