Central Board of Direct Taxes: ఆస్తులే కాదు..ఆదాయ వనరులూ చెప్పాల్సిందే : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశం

  • అభ్యర్థుల భాగస్వాములు, పిల్లల ఆదాయ వనరులు కూడా
  • చట్టసభ్యుల ఆస్తుల వృద్ధిని ప్రజలు అర్థం చేసుకునే వీలు
  • ఎంపీల, ఎంఎల్‌ఏల ఆస్తులు అమాంతం పెరిగాయని ఐటీ శాఖ వెల్లడి

ఎంఎల్‌ఏలు, ఎంపీల ఆదాయం వారి పదవీకాలంలో అమాంతం పెరిగిపోతోన్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఇకపై తమ ఆస్తులు మాత్రమే కాక ఆదాయ వనరులను కూడా అఫిడవిట్‌లో పొందుపరచాలని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. తమతో పాటు తమ జీవిత భాగస్వాములు, పిల్లల ఆదాయ వనరులను కూడా వారు తెలియజేయాలని జస్టిస్ జే చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

అఫిడవిట్‌లు దాఖలు చేసేటపుడు ఆస్తుల చిట్టానే కాక అభ్యర్థులు తమ ఆదాయ వనరులను కూడా తప్పనిసరిగా తెలిపేలా ఆదేశాలివ్వాలంటూ లక్నో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న 'లోక్ ప్రహరి' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. అభ్యర్థులు ఇలా తమ ఆదాయ వనరులను కూడా అఫిడవిట్‌లలో పేర్కొనడం ద్వారా వారి ఆస్తులు సక్రమమైనవా?లేక అక్రమమైనవా? అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరని పిటిషన్ వేసిన సదరు సంస్థ అభిప్రాయపడింది.

కాగా, ఆస్తులు అమాంతం పెరిగిన ఏడుగురు లోక్‌సభ సభ్యులు, 98 మంది ఎంఎల్‌ఏల ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోందని సెంట్రల్  బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఇదివరకే సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదే కేసులో ప్రాథమిక విచారణ చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు లోక్‌సభ ఎంపీల ఆస్తులు భారీగా పెరిగాయని, ఎంఎల్‌ఏల ఆస్తులు కూడా గణనీయంగా పెరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులే కాక తమ ఆదాయ వనరుల వివరాలను కూడా అఫిడవిట్‌లో పొందుపరచాలంటూ కోర్టు తాజాగా తీర్పునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More Telugu News