: కోహ్లీ కంటే పుజారానే బెటర్.. బాగా ఆడుతున్నాడు: గంభీర్
టీమిండియా బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారాపై టీమిండియా వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే పుజారానే నిలకడగా రాణిస్తున్నాడని ఆయన అన్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పుజారా ధాటిగా ఆడుతున్న నేపథ్యంలో గంభీర్ ఇలా ఆయనను కొనియాడాడు. పుజారా టెస్టు మ్యాచులు మాత్రమే ఆడుతున్నాడని, సుదీర్ఘంగా సాగే ఈ టెస్టుల్లో ఫామ్ కొనసాగించాలంటే మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలని ఆయన అన్నాడు.
భారత్‌లో టెస్టు క్రికెట్‌కి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, దేశంలో అందరూ వన్డే, టీ20 పట్లే ఆసక్తి చూపుతున్నారని గంభీర్ అన్నాడు. ఇది దురదృష్టకరమేనని వ్యాఖ్యానించాడు. టెస్టుల్లో పుజారానే అగ్రస్థానంలో ఉంటాడని గంభీర్ అన్నాడు. కోహ్లీ, శిఖర్ ధావన్ కంటే పుజారా నిలకడగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు.