: భార‌తీయ ఉద్యోగుల‌కు హెచ్‌1బీ వీసా ఇబ్బందులు.. కొత్త నియ‌మాలే కార‌ణం!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల‌న‌లో వ‌చ్చిన కొత్త వీసా నియ‌మాలు భార‌తీయ ఐటీ ఉద్యోగుల‌కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అమెరికా ఐటీ రంగంలో 15 శాతం మంది ఉద్యోగులు భార‌త్‌కు చెందిన వారే కావ‌డంతో ఇది పెద్ద సమ‌స్య‌గా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌తి ఏడాది జారీ చేసే 65 వేల హెచ్‌1బీ వీసాల్లో 20 వేలకి పైగా వీసాలు అత్యున్న‌త డిగ్రీ ఉన్న విదేశీయుల‌కే జారీ చేస్తున్నారు.

 ఈ వీసా ద్వారా అమెరికా ఇమ్మిగ్రేష‌న్ అండ్ నేష‌నాలిటీ చ‌ట్టం, సెక్ష‌న్ 101(1)(ఎ)(17)(హెచ్‌) ప్ర‌కారం అమెరికా కంపెనీలు త‌మ ద‌గ్గ‌ర ప‌నిచేసే విదేశీ ఉద్యోగుల‌కు అమెరికాలో నివాసం ఏర్పాటు చేసే అవ‌కాశం క‌లుగుతుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో అత్యంత నైపుణ్యాలు క‌లిగిన ఉద్యోగుల‌కు ఈ వీసాలు జారీ చేస్తారు. ట్రంప్ పాల‌న వ‌చ్చాక ఉద్యోగాల‌ విషయంలో అమెరికన్లకు మొద‌టి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆదేశాలు రావ‌డంతో, వాటి నుంచి తప్పించుకోవడానికి త‌క్కువ జీతానికి ప‌నిచేసే విదేశీ ఉద్యోగుల‌ను ఐటీ కంపెనీలు ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా తీసుకున్నాయి. దీంతో హెచ్‌1బీ వీసాల నియ‌మాల‌ను ట్రంప్ ప్ర‌భుత్వం స‌వ‌రించింది.

కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం హెచ్‌1బీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు త‌మ వృత్తిగ‌త సంబంధ ధ్రువ‌ప‌త్రాల‌న్నీ జ‌త‌చేయాల్సి ఉంటుంది. అలాగే త‌మ క‌ళాశాల విద్య ప‌త్రాల‌ను కూడా అందించాలి. ఆ త‌ర్వాత జారీ అయిన హెచ్‌1బీ వీసాతో మూడేళ్ల‌పాటు అమెరికాలో ఉద్యోగం చేసుకోవ‌చ్చు. దాన్ని మ‌రో మూడేళ్ల‌కు పొడిగించుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. అలాగే ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం కంపెనీ ముందుగా త‌మ అవ‌స‌రాల‌కు త‌గిన అమెరిక‌న్ ల‌భించ‌క‌పోతేనే విదేశీ ఉద్యోగిని నియ‌మించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెచ్‌1బీ వీసా ద్వారా నియ‌మించుకున్న విదేశీ ఉద్యోగి త‌న‌కు న‌చ్చిన విధంగా కంపెనీలు మార‌డానికి వీల్లేదు. ఈ కొత్త నిబంధ‌న‌ల నేప‌థ్యంలో హెచ్‌1బీ వీసాకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా త‌గ్గుతున్న‌ట్లు ఓ స‌ర్వేలో తేలింది. భ‌విష్య‌త్తులో మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌ర్వే పేర్కొంది.

More Telugu News