: అంబులెన్స్ ను అడ్డుకుని రోగి మృతికి కారణమైన హర్యానా బీజేపీ నేత!

తాను ప్రయాణిస్తున్న కారును, ఓ అంబులెన్స్ ఢీకొట్టిందని ఆరోపిస్తూ, దాన్ని అడ్డుకున్న బీజేపీ నేత అందులోని రోగి మృతికి కారణమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఈ మేరకు రోగి బంధువులు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఫతేహాబాద్ బీజేపీ కౌన్సిలర్ దర్శన్ నాగపాల్ కారు ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అంబులెన్స్ ను తాకింది. ఈ ప్రమాదంలో తప్పెవరిదైనా ఎవరికీ గాయాలు కాలేదు. అంబులెన్స్ లో నవీన్ సోనీ అనే వ్యక్తిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆయన బంధువులు సీతారాం, అరుణ్ లు తీసుకెళుతున్నారు.

అంబులెన్స్ ను అడ్డుకున్న నాగపాల్, దాన్ని ముందుకు కదలనీయకుండా అరగంట పాటు ఆపేశారు. వాదోపవాదాలు, పోలీసులు కల్పించుకున్న తరువాత, ఆసుపత్రికి రోగిని తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారని తమ ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. కనీసం పావుగంట ముందు వచ్చినా నవీన్ ను బతికించేవారమని డాక్టర్లు చెప్పారని, తమను అడ్టుకున్న బీజేపీ నేతను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఈ ఆరోపణలను నాగపాల్ తోసిపుచ్చారు. తాను అంబులెన్స్ ను ఆపలేదని, దాని డ్రైవర్ మద్యం తాగివున్నాడని, తనతోనే గొడవపడ్డాడని ఎదురు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో రెండు ఫిర్యాదులపైనా విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News