: శ్రీవారి వెండి వాకిలి వద్ద వంతెన నిర్మాణం... టీటీడీ వివాదాస్పద నిర్ణయం!

స్వయంవ్యక్త సాలగ్రామ మూర్తిగా ఆవిర్భవించిన తిరుమల శ్రీవెంకటేశ్వరుని సన్నిధికి వెళ్లాలంటే, ఏడు వాకిళ్లను దాటాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. సాధారణ భక్తులు కేవలం మూడు వాకిళ్లు దాటి, స్వామిని దర్శించుకుని బయటకు వస్తారు. రద్దీ తక్కువగా ఉన్న వేళ, నాలుగో వాకిలి వరకూ కొన్ని సేవలు, వీఐపీలు వచ్చిన వేళ, ఆరో వాకిలి వరకూ వెళ్లే వీలుంటుంది. ఇక ఈ వాకిళ్లన్నింటిలో వెండివాకిలి అత్యంత కీలకమైనది కాగా, భక్తులు లోపలికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా దీన్నుంచే రాకపోకలు సాగుతుంటాయి. స్వామివారిని దర్శించుకునే భక్తుల సరాసరి 90 వేలకు దగ్గరైన వేళ, వెండి వాకిలి వద్ద భారీ తోపులాటలు నిత్యమూ కనిపిస్తుండగా, ప్రత్యామ్నాయ మార్గాన్వేషణలో ఉన్న టీటీడీ అధికారులు, ఆగమ శాస్త్రాన్ని పక్కనబెట్టి తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వెండి వాకిలి వద్ద ఉన్న గోడ మూడు అడుగుల మందంతో, 30 అడుగుల ఎత్తులో ఉండగా, భక్తులను త్వరగా బయటకు పంపేందుకు ఆ గోడపై నుంచి ఇనుప వంతెనను నిర్మించాలని అధికారులు తలచి, పనులు ప్రారంభించారు. వైఖానస ఆగమ నిబంధనల ప్రకారం స్వామివారి కన్నా ఎత్తులో ఎవరూ నడిచేందుకు వీలు లేదు. గర్భగుడిపై లేదా ఏదైనా ప్రాకారాలపై ఏవైనా పూజలు చేయాల్సి వస్తే, దీక్షా వస్త్రాలు ధరించినవారే వాటిపై కాలుమోపుతారు. శ్రీవారు వేంచేసిన కొండపై విమానాలు తిరిగేందుకు కూడా అనుమతి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులను వెండి వాకిలి పైనుంచి తరలించాలన్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.

More Telugu News