: విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపింది ఇండోర్ గ్యాంగ్!

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పులకు పాల్పడింది ఇండోర్ కు చెందిన సుపారీ గ్యాంగ్ అని బంజారా హిల్స్ పోలీసులు తేల్చి చెప్పారు. సుపారీ గ్యాంగ్ తో కాల్పులకు ఆరు నెలల నుంచి విక్రమ్ ప్లాన్ చేశాడని, నిపుణుడైన ఓ షూటర్ ని ఎంపిక చేసుకుని కాల్పులకు పథకం వేసుకున్నాడని పోలీసుల సమాచారం. కాల్పులు జరిపితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని భావించిన విక్రమ్ తన ఇంటి లోపల, బయట సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడని సమాచారం. ఈ కాల్పుల ఘటనకు రెండు రోజుల ముందు ఆ నిపుణుడైన షూటర్ సహా మరో ఇద్దరు ఇక్కడికి వచ్చి వెళ్లారని, కాల్పులు ఎక్కడ జరపాలి, శరీరంపై ఎక్కడ గాయపర్చాలనే విషయమై విక్రమ్ ఓ ట్రయల్ రన్ వేశాడని పోలీసులు పేర్కొన్నారు.

మూడు రౌండ్ల కాల్పులు జరపాలని సదరు షూటర్ కు విక్రమ్ చెప్పాడని, కాల్పులు జరిపాక ఏ మార్గంలో పారిపోవాలో విక్రమ్ స్కెచ్ వేసి ఇచ్చాడని, సీసీ కెమెరాలు లేని రూట్ ను  నిందితులకు విక్రమ్ చూపించాడని సమాచారం. అయితే, రెండు రౌండ్ల కాల్పులకే భయపడిపోయిన సదరు షూటర్, మూడో రౌండ్ కు ముందే పారిపోయాడని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి సిటీ బయటకు నిందితులు పారిపోయారని, వారిలో నిపుణుడైన షూటర్ ఇండోర్ కు, మరో ఇద్దరు అనంతపురం, ఇంకొకరు బెంగళూరుకు పారిపోగా, మూడు ప్రాంతాల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. కాగా, ఈ కేసులో ఎ1గా విక్రమ్ గౌడ్, ఎ2 గా ఇండోర్  కు చెందిన షూటర్, హైదరాబాద్ కు చెందిన అహ్మద్ ఖాన్ తో పాటు మరో ముగ్గురు నిందితులపై 120,120 బి, 420, 404, 27 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

More Telugu News