: ప్రేమికులను వేధిస్తూ, వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టి రాక్షసానందం... బాధితుల ఫిర్యాదుతో స్పందించిన ఫేస్ బుక్

ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రేమికుల జంటను అటకాయించి, వారిని దూషిస్తూ, బెదిరిస్తూ, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, బాధితుల అభ్యర్థన మేరకు ఫేస్ బుక్ ఆ వీడియోను తొలగించింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పెరంబలూరు ప్రాంతానికి చెందిన  వేలుమురుగన్‌ కోలంగినాథన్ అనే యువకుడి ఖాతాలో ఓ వీడియో పోస్ట్ అయింది.

 బైక్ పై వెళుతున్న జంటను అటకాయించిన కోలంగినాథన్, వారిని కులం పేరుతో తిట్టాడు. తాము ప్రేమికులమని, కేవలం మాట్లాడుకోవడానికి వచ్చామని, వీడియో తీయవద్దని, బైక్ వెనక కూర్చున్న యువతి వేడుకున్నా వినలేదు. అమ్మాయి భవిష్యత్తు నాశనమవుతుందని అబ్బాయి చెప్పినా పట్టించుకోలేదు. కోలంగినాథన్ సహా మరో ముగ్గురు నలుగురు అతని స్నేహితులు ఈ జంటను వేధించారు. ఈ ఘటన ఓ గ్రామ సమీపంలో జరిగింది. ఆపై తాను తీసిన వీడియోను పోస్టు చేసి రాక్షసానందం పొందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కోలంగినాథన్ ఇంటి చిరునామా కనిపెట్టి వెళ్లగా, అప్పటికే పారిపోయాడు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News