: నంద్యాలలో నిధుల ప్రవాహానికి బ్రేక్... కొత్త పనులూ నిల్!

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం, ఆపై వెంటనే కోడ్ అమలులోకి రావడంతో కొత్త పనులు, ప్రాజెక్టులు ప్రకటన నిలిచిపోనుంది. ఇప్పటికే ప్రారంభించిన పనులను చేస్తూ ఉండేందుకు అనుమతులు ఉంటాయే తప్ప, కొత్తగా మరో పని మొదలు పెట్టేందుకు వీలుండదు. నంద్యాల ఉప ఎన్నికలకు అధికార తెలుగుదేశం, విపక్ష వైకాపాలు అభ్యర్థులను ఖరారు చేసిన తరువాత, సీఎం చంద్రబాబు మూడు సార్లు నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను, హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పేదలకు 13 వేల గృహాలు, ముస్లిం షాదీఖానా, రహదారుల వెడల్పు, గ్రామాలకు కొత్త రోడ్లు, నీటి సరఫరాకు చర్యలు... ఇలా ఎన్నో హామీలను ఆయన గుప్పించారు. దాదాపు రూ. 900 కోట్ల విలువైన పథకాలను ఆయన ప్రకటించారు. వీటిల్లో చాలా పనులకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ పనులను చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఇక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతోనే శాంతి భద్రతలు, సాధారణ పాలనా పగ్గాలు కర్నూలు కలెక్టర్, నంద్యాల రెవెన్యూ అధికారులు, పోలీసుల చేతికి వెళ్లిపోయాయి. వచ్చే నెల 23వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News