: సీవో అంటే కొకైన్....బ్లాక్ బెర్రీ అంటే అమ్మాయి... కోడ్ లాంగ్వేజ్!

ముఖ్యంగా చదువుకోవడానికి వస్తున్నాం.. అంటూ మన దేశంలోకి ప్రవేశిస్తున్న నైజీరియన్లు డ్రగ్స్ సరఫరాతో యువత పతనానికి కారణమవుతున్నారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా వ్యభిచారాన్ని కూడా వీరు నిర్వహిస్తున్నారు. రాచకొండ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ నైజీరియన్ల నుంచి వివిధ ఆసక్తికర వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్వోటీ, ఎల్బీ నగర్‌ పోలీసులు నిఘాపెట్టారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎల్బీ నగర్‌ బస్టాపులో సంగీత, జాన్‌ ను అదుపులోకి తీసుకుని, వారి నుంచి మూడు గ్రాముల కొకైన్, 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తెలుగమ్మాయి అయిన సంగీతకు నైజీరియన్ జాన్ ఎలా పరిచయమని ఆరాతీశారు. విజయవాడకు చెందిన పాలపర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్‌ సెంటర్‌ లో పనిచేస్తుండగా, ఫేస్‌ బుక్‌ లో సూడాన్‌ కు చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయంతో సంగీత హైదరాబాద్‌ కు మకాం మార్చింది.

అక్కడ సంగీతకు ఆమె, నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్, అతడి స్నేహితులను పరిచయం చేసింది. దీంతో బండ్లగూడలోని సన్ సిటీలో ఒక ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని ఒజుకు కాస్మోస్ తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి వారితో కలసి డ్రగ్స్‌ అక్రమ రవాణాలో ఆమె భాగస్వామిగా మారింది. తమ దేశానికి చెందిన గాబ్రియెల్ అనే స్నేహితుడి సాయంతో కొకైన్, బ్రౌన్‌ షుగర్, అంఫిటమైన్‌ వంటి డ్రగ్స్ ను టాబ్లెట్‌ ల రూపంలో తీసుకొచ్చి స్నేహితులైన జాన్‌ ఒకొరి, సిరిల్, హెన్రీలతో కలిసి వీరిద్దరూ హైదరాబాదులోని పలువురు డ్రగ్ వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా, డెబిట్‌ కార్డు తీసుకుని వినియోగిస్తున్నారు. డ్రగ్స్ ను సరఫరా చేసే క్రమంలో పలువురితో ఏర్పడిన సంబంధాలతో వీరు వ్యభిచారాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ తో పాటు అమ్మాయిలను కూడా వీరు సరఫరా చేస్తారు. ఇందుకోసం వీరు కోడ్ లాంగ్వేజ్ ను వాడుతారు.

ఇందులో సీవో అంటే కొకైన్‌ కావాలని అర్ధం. అలాగే బ్లాక్‌ బెర్రీ అంటే అమ్మాయి అని అర్థం. సీవో విత్ బ్లాక్ బెర్రీ అంటే డ్రగ్స్ తో పాటు అమ్మాయి కూడా కావాలని అర్థమని విచారణలో గుర్తించారు. వ్యభిచారాన్ని యాప్రాల్‌ కేంద్రంగా కుషాయి గూడ, ఏఎస్‌ రావు నగర్, జవహర్‌ నగర్, నేరేడ్‌ మెట్‌ లలో నిర్వహిస్తున్నారు. వీరికి గోవాలోని డ్రగ్స్ మాఫియాతో లింకులున్నాయి. నిజాంకాలేజీలో డిగ్రీ చదువుతున్న జాన్, సిరిల్‌ లతో పాటు సన్‌ సిటీలో కాస్మోస్‌ ను, మేడ్చల్‌ జిల్లా యాప్రాల్‌ లోని తిరు అపార్ట్‌మెంట్‌ లో సిరిల్‌ ను అరెస్టు చేశారు. వీరి నుంచి 2,04,000 రూపాయలు, 9,70,000 రూపాయల విలువ చేసే 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్‌ షుగర్, 39.8 గ్రాముల అంఫిటమైన్‌ ట్యాబ్లెట్లు, 1.675 కిలోల గంజాయి, 3 ల్యాప్‌ టాప్‌ లు, 6 పాస్‌ పోర్టులు, తొమ్మిది సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News