: డ్రగ్స్ వినియోగం, విక్రయాలు, సరఫరాపై ఆయా దేశాల్లో విధించే శిక్షలు!

హైదరాబాద్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండటం, నోటీసులు అందుకోవడం విదితమే. ప్రముఖ దర్శకుడు పూరీ, నటులు నవదీప్, తరుణ్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడు, నటి ఛార్మి నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. అయితే, వీళ్లందరూ డ్రగ్స్ వినియోగించారా? ప్రోత్సహించారా? సరఫరా చేశారా? లేక ఈ రెండింటికీ పాల్పడ్డారా? అనే విషయం సిట్ అధికారుల విచారణలోగానీ తేలదు. అయితే, మన దేశంలోనే కాకుండా విదేశాల్లో డ్రగ్స్ వినియోగించే వారిపై, విక్రయించే వారిపై, స్మగ్లర్లపై కూడా అక్కడి ప్రభుత్వాలు కన్నెర్రజేస్తూనే ఉన్నాయి. వాటి నియంత్రణకు చర్యలూ చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో విధించే శిక్షలు, జరిమానా గురించి చెప్పాలంటే..

భారత్ లో శిక్షలు: 

* నల్లమందు, గంజాయి, కొకైన్ మొక్కలు సాగుచేస్తే  -  3- 10 ఏళ్ల జైలు, రూ.లక్ష జరిమానా
* నల్లమందు వ్యాపారానికి సహకరించినా, ప్రేరేపించినా  - 10-20 ఏళ్ల జైలు, రూ.2 లక్షల వరకూ జరిమానా
* మిగిలిన డ్రగ్స్ వినియోగిస్తే 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది
* ప్రభుత్వ గుర్తింపు పొందిన డీ అడిక్షన్ కేంద్రాల్లో స్వచ్ఛందంగా చికిత్స తీసుకునేందుకు సిద్ధపడ్డ బాధితులకు సెక్షన్ 64ఏ ప్రకారం వారికి శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ సౌలభ్యం పూర్తి స్థాయి చికిత్సను తీసుకుంటేనే వర్తిస్తుంది. లేని పక్షంలో శిక్ష మినహాయింపు రద్దవుతుంది
* విదేశీయులతో డ్రగ్స్ వ్యాపార లావాదేవీలు, డ్రగ్స్ కలిగి ఉండటం  - 10-20 ఏళ్ల పాటు కఠిన జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా
* మాదకద్రవ్యాల సాగు, తయారీ, కలిగి ఉండటం, అమ్మడం, కొనుగోలు, రవాణా, దిగుమతి, ఎగుమతి - రెండు గ్రాముల లోపు డ్రగ్స్  అయితే ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, అంతకుమించి ఎక్కువ మోతాదులో కలిగి ఉంటే 10-20 ఏళ్ల జైలు, రూ.2 లక్షల జరిమానా
* నేరం చేసేందుకు సిద్ధమైనట్టు తెలిస్తే - 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా
* డ్రగ్స్ కు సంబంధించిన నేరాన్ని పదేపదే చేస్తే కనుక - శిక్ష ఒకటిన్నర రెట్లు పెరుగుతుంది.

ఇక, విదేశాల్లో విధించే శిక్షల విషయానికొస్తే:

* చైనాలో డ్రగ్స్ కు బానిసలైన వారిని ప్రభుత్వమే నిర్బంధంగా మూడేళ్ల పాటు డీటాక్సిఫికేషన్ కేంద్రాలకు పంపుతారు
 * చైనాలో డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగదారులకు కఠినశిక్షలు. నల్లమందును కిలోకు మించి ఉత్పత్తి చేస్తే మరణశిక్ష విధిస్తారు.
* పోర్చుగల్ లో అన్ని రకాల డ్రగ్స్ వినియోగంపైనా నిషేధం. అయితే, ఈ నిబంధనను ఉల్లంఘించినా నేరంగా పరిగణించరు. వారి అలవాటు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
* ఇరాన్, ఇండోనేషియాలలో డ్రగ్ స్మగ్లర్లకు మరణ శిక్ష విధిస్తారు.
* సౌదీ అరేబియాలో అయితే స్మగ్లర్లను తలను  నడిబజారులో నరికేస్తారు. డ్రగ్స్ కు అలవాటైన వారిని దాని నుంచి బయటపడేలా చూస్తారు.
* అమెరికాలోని పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగించినా, తమ వద్ద ఉంచుకున్నా కూడా రెండున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తారు. శిక్షలతో పాటు సామాజిక సేవ చేయాలనీ ఒకోసారి ఆదేశించవచ్చు.
* అమెరికాలో డ్రగ్స్ విక్రేతలకు కనీసం 3-9 ఏళ్ల జైలు శిక్ష. అదే, పిల్లలకు డ్రగ్స్ విక్రయిస్తే.. పదేళ్ల జైలు. డ్రగ్స్ స్మగ్లర్లకు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు.
* వాషింగ్టన్ స్టేట్, కొలరాడోలో 28 గ్రాముల వరకు గంజాయి కొనుగోలు చేయవచ్చు.
* డెన్మార్క్ లో డ్రగ్స్ వినియోగం కోసం ప్రత్యేకగదులు ఉంటాయి.
* నెదర్లాండ్స్ లో డ్రగ్స్ ఎగుమతి, దిగుమతి నేరంగా పరిగణిస్తారు. 16 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అయితే, పర్యాటకులు గంజాయిని వినియోగించినా పెద్దగా పట్టించుకోరు.
* గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశం  ఉరుగ్వే. ఇక్కడి మందుల షాపుల్లోనే గంజాయిని కొనుక్కోవచ్చు. ఒక్కొక్కరు నెలకు 40 గ్రాముల వరకు గంజాయి కొనుగోలు చేయవచ్చు.
*  స్పెయిన్ లో డ్రగ్స్ నిషేధమే లేదు. బహిరంగంగా మాత్రం తీసుకోకూడదు. అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తే మాత్రం కఠిన శిక్షలు తప్పవు.
* జపాన్ లో  68 రకాల మాదక ద్రవ్యాల ఉత్పత్తి, విక్రయంపై పూర్తి స్థాయి నిషేధం అమలులో ఉంది. మరో విషయమేమిటంటే, జలుబు, ఫ్లూ కోసం ఉపయోగించే అన్ని ఔషధాల వాడకాన్ని  ఈ దేశంలో నియంత్రించారు.

More Telugu News