: చెలరేగి ఆడిన హర్మన్‌ప్రీత్‌కౌర్.. ఫైనల్‌కు భారత్.. ఆసీస్ చిత్తు!

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు  చేరింది. గురువారం డెర్బీలోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, ఆరుసార్లు ప్రపంచకప్ విజేత అయిన ఆసీస్‌ను చిత్తుచేసి ఫైనల్‌కు చేరుకుంది. ఇక కప్పు అందుకోడానికి ఉన్న దూరం ఒకే ఒక్క మ్యాచ్. ఆదివారం ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరగనున్న ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఇక గురువారం నాటి మ్యాచ్‌కు తొలుత వర్షం వల్ల అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్ దాదాపు రెండు గంటల ఆలస్యంగా మొదలైంది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి ప్రత్యర్థి ఆసీస్ ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ విమెన్‌లలో అలెక్స్ బ్లాక్‌వెల్ (90), విలానీ (75), ఎల్లీస్ పెర్రీ (38) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, జులన్‌ గోస్వామి, శిఖా పాండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరు పరుగుల వద్దే స్మృతి మందన (6) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 35 పరుగుల వద్ద రెండో వికెట్, 101 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాట్‌ను ఝళిపించడం మొదలుపెట్టింది. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపింది. మెరుపు బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలింగ్‌ను కకావికలు చేసింది. 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 171 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. హర్మన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

More Telugu News