: ఐటీసీ వల్ల ఎల్ఐసీకి 30 నిమిషాల్లో రూ.7,000 కోట్ల నష్టం

ప్రభుత్వరంగ దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీకి ఒక్క రోజులోనే రూ.7,000 కోట్ల మేర నష్టం ఎదురైంది. ఎలా అనుకుంటున్నారా...? స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల వల్ల ఇలా జరిగింది. ప్రముఖ కంపెనీ ఐటీసీలో ఎల్ఐసీకి 16.29 శాతం వాటా ఉంది. ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీలో సిగరెట్లపై పన్ను భారం తగ్గింది. దీంతో ప్రముఖ సిగరెట్ల తయారీ సంస్థ ఐటీసీ షేరు కొన్ని రోజుల్లోనే 10 శాతం వరకు పెరిగింది. జీఎస్టీలో పన్ను రేట్లు తగ్గితే ఆ ప్రయోజనాలను కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయాలి.

కానీ, సిగరెట్లు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి గనుక రేట్లు తగ్గిస్తే వినియోగం ఎక్కువైపోతుంది. అందుకే సిగరెట్ల కంపెనీలు రేట్లు తగ్గించలేదు. దీంతో లాభాలు పెరిగిపోయే అవకాశం ఏర్పడింది. దీన్ని పరిశీలించిన కేంద్ర ఆర్థిక శాఖ కంపెనీలు లాభాలు పోగేసుకునే అవకాశం ఇవ్వకూడదని భావించి సిగరెట్లపై అదనపు పన్ను వడ్డన చేసింది. దీంతో ఐటీసీ స్టాక్ మంగళవారం 11 శాతం వరకు ఒకే రోజులో 37 రూపాయలు తగ్గి రూ.288 వద్ద ట్రేడవుతోంది. దీనివల్ల ఈ కంపెనీలో ఎల్ఐసీ వాటాల విలువ రూ.7,000 కోట్ల మేర తరిగింది.

More Telugu News