: పదహారేళ్ల తర్వాత రైలెక్కిన గంగూలీకి చేదు అనుభవం!

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సుమారు పదహారేళ్ల తర్వాత నిన్న రైలెక్కారు. అయితే, ఆయనకు రైల్లో చేదు అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన ఏసీ ఫస్ట్ క్లాసు కంపార్ట్ మెంటు సీటులో మరొక ప్రయాణికుడు వుండడం చూసి గంగూలీ అవాక్కయ్యాడు. దీంతో, అది తనకు కేటాయించిన సీటు అని చెప్పినప్పటికీ, సదరు ప్రయాణికుడు పట్టించుకోకపోగా, గొడవకు దిగాడు. ఇది తనకే కేటాయించారంటూ వాదించాడు. ఇంతలో, ఆర్పీఎఫ్ సిబ్బంది కలగజేసుకుని, గంగూలీకి సెకండ్ క్లాస్ ఏసీలో మరో బెర్త్ కేటాయించారు.

ఇంతకీ, గంగూలీ రైలు ప్రయాణం ఎందుకు చేశాడంటే.. పశ్చిమబెంగాల్ లోని బలూర్ ఘాట్ లో గంగూలీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ నిమిత్తం గంగూలీ సహా సీఏబీ జాయింట్ సెక్రటరీ అభిషేక్ దాల్మియా పడాటిక్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ, 2001 తర్వాత మళ్లీ ఇప్పుడు రైల్లో ప్రయాణించానని చెప్పారు.

More Telugu News