: 100 అడుగుల ఎత్తు నుంచి స‌ముద్రంలో ప‌డిపోయి... ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

  సముద్రంపై వంద అడుగుల ఎత్తులో పారాసెయిలింగ్‌ చేస్తున్న ఓ వృద్ధుడు అమాంతం కింద‌కు ప‌డిపోవ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు. త‌న భ‌ర్త హాయిగా గాలిలో విహ‌రిస్తున్నాడంటూ వీడియో తీసిన ఆ వృద్ధుడి భార్య ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌యింది. ఈ ఘ‌ట‌న థాయిలాండ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, పారాసెయిలింగ్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డే రోగర్‌ హుస్సే (71) అనే ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్య‌క్తి త‌న భార్య‌తో క‌లిసి థాయిలాండ్‌లోని ఓ బీచ్‌కు వెళ్లాడు. స‌ముద్రంపై గాల్లో తేలియాడుతూ వెళ్ల‌బోతున్నాన‌ని త‌న భార్య‌తో చెప్పిన ఆయ‌న‌.. సెయిలింగ్‌కు ముందు రక్షణగా ఉండే డ్రెస్ వేసుకున్నాడు.

పారాసెయిలింగ్‌ శిక్షకుడితో క‌లిసి రోగర్ గాల్లోకి ఎగిరాడు. సముద్రంపై బోటు వేగంగా దూసుకెళుతోంది. పారాసెయిలింగ్‌తో ఆ ఇద్ద‌రు సముద్రంపై ఓ వంద అడుగుల ఎత్తులో ఉన్నారు. ఒక్క‌సారిగా వారికి క‌ట్టిన తాడు తెగిపోవ‌డంతో రోగ‌స్ స‌ముద్రంలో ప‌డిపోయాడు. గాల్లో ఉండ‌గానే అత‌డి ఊపిరి ఆగిపోయింది. ఆసుప‌త్రికి తీసుకెళ్లితే అత‌డు చ‌నిపోయాడ‌ని వైద్యులు నిర్ధారించారు. ఆ వృద్ధుడి భార్యే స్వ‌యంగా ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి తన భర్త ఇకలేడని తెలిపింది. పారాసెయిలింగ్‌ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News