: సోమవారం నుంచి భారీ వర్షాలు: ఇస్రో

ఆదివారం నాటికి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇస్రో అంచనా వేసింది. వాతావరణ మార్పులు, వర్షాల రాకపోకలపై సమాచారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ వివరాలను ఇస్రో ప్రభుత్వానికి తెలిపింది. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశాలో వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంటుందని, శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ప్రకాశం, కర్నూలు, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని, ఆపై 20వ తేదీ నుంచి రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయని తెలిపారు. గోదావరి, కృష్ణా, బీమా నదుల ఎగువ, దిగువ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతమే ఉంటుందని ఇస్రో సమాచారాన్ని అందించింది. కాగా, రాయలసీమపై నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు చిన్న పాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

More Telugu News