: గర్వంగా చెబుతున్నా... నేను తమిళబిడ్డను!: బాలకృష్ణ

"నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడి నీళ్లే తాగాను. ఇక్కడి గాలి పీలుస్తూ ఎదిగాను. గర్వంగా చెప్పగలను... నేను తమిళబిడ్డనని. మీ ఇంటి బిడ్డనని" అని హీరో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి చెన్నైలోని కలైవానర్‌ ఆరంగంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' తమిళ వర్షన్ ఆడియో విడుదల వైభవంగా జరుగగా, బాలకృష్ణ అందరినీ ఆకట్టుకునేలా స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడారు.

'వీరపాండి కట్టబొమ్మన్‌' చిత్రంలో శివాజీ గణేశన్ చెప్పిన డైలాగులు చెప్పి తమిళ అభిమానులను అలరించిన బాలయ్య, 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రాంతీయ భాషా చిత్రం కాదని, దేశం మొత్తం చూడవలసిన ఓ వీరుడి కథని, దీన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరో హీరో కార్తి, దర్శకుడు కేఎస్ రవికుమార్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్, నిర్మాతలు సీ కల్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్, చిత్ర దర్శకుడు క్రిష్ తదితరులు పాల్గొన్నారు. ఎంజీఆర్ తనకు పెదనాన్న అయితే, శివాజీ గణేశన్ చిన్నాన్నని, వీరి మధ్య తిరుగుతూనే తాను పెరిగి పెద్దవాడిని అయ్యానని బాలకృష్ణ చెప్పిన మాటలకు ఆడిటోరియం చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది.

More Telugu News