: ఇక తిరుమలలో రూములు కావాలన్నా అదృష్టం ఉండాల్సిందే!

తిరుమల శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం కలగాలంటే, అదృష్టం ఉండాల్సిందేనన్న సంగతి మనకు తెలుసు. లక్కీ డిప్ వ్యవస్థను ప్రవేశపెట్టిన టీటీడీ, పలు రకాల ముఖ్యమైన సేవల టికెట్లను లాటరీ విధానంలో విక్రయిస్తోంది. ఇక తిరుమలలో రూములు కావాలన్నా ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ నెల 12 నుంచి ఈ విధానాన్ని అవలంబించనున్నామని, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసులో ఇందుకోసం 10 కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

తిరుమలలో మొత్తం 6,600 అద్దె గదులు ఉండగా, వాటిల్లో 2 వేల రూములను ఆన్ లైన్లో అలాట్ చేస్తున్నామని, మిగతా అద్దెగదుల్లో 2,800 గదులను టోకెన్ సిస్టమ్ విధానంలో లక్కీ కస్టమర్లకు ఇస్తామని తెలిపారు. రూములు కావాల్సిన వారు తమ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ లతో ఈ కౌంటర్లలో నమోదు చేసుకోవాలని, ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు 1400 గదుల చొప్పున టోకెన్లు పంచుతామని అన్నారు. రూ. 50 నుంచి రూ. 1000 వరకూ అద్దె ఉన్న గదులను లక్కీ డిప్ విధానంలో కేటాయిస్తామన్నారు. రూములు పొందిన భక్తులు వెంటనే డబ్బు చెల్లించి, అరగంట వ్యవధిలోనే గదిలో చేరిపోవచ్చని తెలిపారు. గంటల కొద్దీ క్యూలైన్లలో గదుల కోసం వేచి చూడకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సింఘాల్ పేర్కొన్నారు.

More Telugu News