: రైల్వే స్టేషన్లకు కొత్త రూపు.. టికెట్ చెకింగ్‌కు ఇక బార్‌కోడ్ గేట్లు.. టికెట్ లేకుంటే లోపలికి వెళ్లలేరంతే!

అతి త్వరలో రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారిపోనున్నాయి. స్టేషన్లలో టికెట్ చెకింగ్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సరికొత్త ఐడియాతో రైల్వే ముందుకొచ్చింది. ఇప్పటికే కోల్‌కతా, ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఉన్న ఆటోమెటిక్ ఫ్లాగ్ గేట్లను అన్ని ముఖ్యమైన స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వీటికి ఉండే బార్ కోడ్ కారణంగా టికెట్ల చెకింగ్ మరింత వేగవంతమవుతుందని భావిస్తోంది. ఫలితంగా టీటీఈలపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతోంది. భారతీయ రైల్వేకు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ సీఆర్ఐఎస్ ఇప్పటికే ఈ పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీ డివిజన్‌లోని బ్రార్ స్క్వేర్ స్టేషన్‌లో ఇప్పటికే ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నారు. మరో మూడు నెలల్లో ఇక్కడ ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడ ఇది విజయవంతమైతే అన్ని స్టేషన్లలోనూ ఈ ఆటోమెటిక్ ఫ్లాగ్ గేట్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వీటిని చూపిస్తే గేట్లు ఆటోమెటిక్‌గా తెరుచుకుంటాయి. ఫలితంగా ప్రయాణికులు టికెట్లు లేకుండా స్టేషన్‌లోకి ప్రవేశించలేరు. ఒక్కో స్టేషన్‌లో బార్ కోడ్‌ కలిగిన ఆటోమెటిక్ గేట్లను ఏర్పాటు చేయడానికి రైల్వేకు రూ.4 లక్షలు ఖర్చవుతుందని అంచనా. బార్ కోడ్ టికెట్ల కోసం థర్మల్ ప్రింటర్లు తదితర ఏర్పాటు దీనికి అదనం.

More Telugu News