: చైనాకు షాకిచ్చిన 'యంగ్' వాజపేయి.. చైనా ఎంబసీలోకి 800 గొర్రెలను తోలారు!

భారత్ విషయంలో ప్రతి చిన్న విషయానికి చైనా గిల్లికజ్జాలు పెట్టుకుంటుందనే విషయానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉండదేమో. ఈ ఘటన కూడా సిక్కిం సరిహద్దులోనే జరిగింది. 1965లో ఇది చోటు చేసుకుంది. సిక్కిం సరిహద్దు వద్ద తమ దేశానికి చెందిన వ్యక్తులకు చెందిన 800 గొర్రెలు, 59 జడలబర్రెలను భారత సైనికులు దొంగిలించారని ఆరోపిస్తూ అప్పట్లో చైనా నానా హంగామా చేసే ప్రయత్నం చేసింది. ఈ గొర్రెలు, బర్రెలకు సంబంధించి అప్పట్లో ఇరు దేశాల మధ్య లేఖల యుద్ధం సాగింది. తమ గొర్రెలను, బర్రెలను తిరిగి ఇవ్వాలని లేకపోతే పరిస్థితులు దారుణంగా మారతాయని భారత్ ను చైనా హెచ్చరించింది.

చైనా తీరుతో చిర్రెత్తుకొచ్చి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అప్పట్లో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. చైనా అనుసరిస్తున్న దిగజారుడు విధానాలను నిరసిస్తూ.... ఢిల్లీలోని చైనా ఎంబసీలోకి గొర్రెల మందను తోలారు వాజ్ పేయి. 'మమ్మల్ని తినండి. కానీ, ప్రపంచాన్ని కాపాడండి' అని రాసి ఉన్న ప్లకార్డులను గొర్రెల మెడలో వేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ గొర్రెలు, బర్రెల పేరుతో ప్రపంచ యుద్ధానికి చైనా తెరలేపుతోందని విమర్శించారు.

మరోవైపు వాజ్ పేయి గొర్రెల నిరసనతో చైనా షాక్ కు గురైంది. దీంతో, చైనా లో ఉన్న భారత ఎంబసీకి ఓ ఘాటు లేఖ రాసింది. నిరసన కార్యక్రమం వాజపేయి చేపట్టినప్పటికీ... దీని వెనకున్నది మాత్రం భారత ప్రభుత్వమే అని లేఖలో ఆరోపించింది. దీనికి తోడు, భారత బలగాలు ఆకస్మిక దాడులకు పాల్పడుతూ, తమ మిలిటరీ స్ట్రక్చర్స్ లోకి చొచ్చుకు వస్తున్నాయని లేఖలో తెలిపింది.

దీనికి సమాధానంగా చైనాకు భారత్ ఓ లేఖ రాసింది. ఢిల్లీలోని చైనా ఎంబసీలో జరిగిన నిరసన చాలా ప్రశాంతమైందని లేఖలో పేర్కొంది. ఈ సందర్భంగా ఢిల్లీవాసులు కొందరు 800 గొర్రెలను చైనా ఎంబసీలోకి తోలారని... ఇది ఊహించని విధంగా జరిగిందని తెలిపింది. నిరసన కార్యక్రమం చాలా ప్రశాంతంగానే కాక ఎంతో హ్యూమరస్ గా ఉందని పేర్కొంది.

More Telugu News