: 13 డిమాండ్లపై స్పందించేందుకు ఇక కొన్ని గంటలే గడువు... ఖతార్ ఏం చేయనుందన్న ఉత్కంఠ!

13 డిమాండ్లపై స్పందించేందుకు ఖతార్ కు సౌదీ నేతృత్వంలోని అరబ్‌ దేశాలు 48 గంటల గడువు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగనుందన్న ఉత్కంఠ సర్వత్ర పెరుగుతోంది. తమ డిమాండ్లను అంగీకరించకుంటే వెలివేస్తామని, ఆంక్షలు అమలు చేస్తామని అరబ్ దేశాలు హెచ్చరిస్తున్నాయి. అల్‌ జజీరా ఛానల్‌ మూసివేత, టర్కీ సాయుధ దళాలను తొలగించడం, ఇరాన్‌ తో బంధాలను తెంచుకోవడం, ఐసిస్, అల్‌ ఖైదా వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను వదులుకోవడం.. వంటి 13 డిమాండ్లను అరబ్ దేశాలు ఖతార్ ముందుంచిన సంగతి తెలిసిందే.

ఈ గడువు సోమవారంతో ముగిసినా ఖతార్ స్పందించలేదు. దీంతో మరో రెండు రోజుల గడువును ఖతార్ కు అదనంగా ఇస్తున్నట్టు అరబ్ దేశాలు తెలిపాయి. ఖతార్ పాలకుడి కోరిక మేరకే తాము గడువు పెంచుతున్నామని అరబ్ దేశాలు తెలిపాయి. ఖతార్ ఇప్పటికైనా సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. కాగా, ఈ డిమాండ్లను అంగీకరించడం సాధ్యం కాదని, ఎలాంటి పర్యవసానాలకైనా సిద్ధంగా ఉన్నామని రోమ్ పర్యటనలో ఉన్న ఖతార్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ తనీ తెలిపారు. అదే సమయంలో తమతో దౌత్య సంబంధాలు తెంచుకున్న దేశాలతో చర్చించేందుకు ఖతార్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరబ్ దేశాలు ఖతార్ కు మరో రెండు రోజుల గడువును పొడిగించాయి.

More Telugu News