: మహిళా ప్రపంచ కప్: టీమిండియా చేతిలో పాకిస్తాన్ చిత్తు!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాకు చేతకాని పనిని భారత మహిళా జట్టు చేసి చూపింది. బ్యాటింగ్, బౌలింగ్ లలో రాణించి పాక్ మహిళా జట్టును భారత మహిళా క్రికెట్ జట్టు ఓడించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఓపెనర్ స్మృతి మందాన (2) వికెట్ ను ఆదిలోనే కోల్పోయింది. అనంతరం ఇన్నింగ్స్ కు పూనమ్ రౌత్ (47), దీపాలి శర్మ (28) మరమ్మతు చేశారు. జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును కదిలించారు. పూనమ్ అవుట్ కాగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (8) విఫలమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (10), మస్రామ్ (6) విఫలమయ్యారు. సుష్మా వర్మ (35) మెరుపులు మెరిపించి, భారీ షాట్లతో ఆకట్టుకుంది. సీనియర్ జులన్ గోస్వామి (10) ఫర్వాలేదనిపించింది. ఏక్తా బిస్త్ (1) విఫలం కాగా, జోషి (4), పూనమ్ యాదవ్ (6) నాటౌట్ గా నిలిచారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

అనంతరం 170 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ బ్యాట్స్ ఉమన్ ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. వరుసగా వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. భారత బౌలర్ల ధాటికి కేవలం ఇద్దరు పాక్ బ్యాట్స్ ఉమన్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాక్ బ్యాటింగ్ ను ఆయేషా జఫర్ (1), నహీదా ఖాన్ (23) ప్రారంభించారు. జవేరీ ఖాన్ (6), సిద్రా నవాజ్ (0), ఇరమ్ జావెద్ (0), నైనా అబిది (5), అస్మావియా ఇక్బాల్ (0), నస్రా సంధు (1), డైనా బేగ్ (0) అవుటయ్యారు. చివర్లో కెప్టెన్ సనా మిర్ (29) కు సాదియా యూసుఫ్ (3) చక్కని సహకారమందించింది. దీంతో పాకిస్థాన్ జట్టు 38.1 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఐదు వికెట్లతో ఎక్తా బిస్త్ అద్భుతంగా రాణించగా, రెండు వికెట్లతో జోషీ, జులన్ గోస్వామి, దిపాలీ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ చెరొక వికెట్ తీశారు. వుమన్ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ లలో భారత మహిళల జట్టు విజయం సాధించడం విశేషం.

More Telugu News