: ఆకట్టుకున్న భారత్ బ్యాట్స్ ఉమన్... పాక్ ముందు 170 పరుగుల లక్ష్యం

ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా డెర్బీలో జరుగుతున్న వన్డేలో భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ జట్టు ప్రారంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. ఆదిలోనే ఓపెనర్ గా మంచి ఫాంలో ఉన్న స్మృతి మందాన (2) ను అవుట్ చేసి షాకిచ్చింది. అనంతరం పూనమ్ రౌత్ (47), దీపాలి శర్మ (28) జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు పరుగెత్తించారు. ఈ క్రమంలో అర్ధసెంచరీకి చేరువైన పూనమ్ ను అద్భుతమైన బంతితో నస్రా సంధు బోల్తా కొట్టించింది. అనంతరం దిగుతూనే బౌండరీతో దూకుడు ప్రదర్శించిన కెప్టెన్ మిథాలీ రాజ్ (8) ను కూడా పెవిలియన్ కు పంపింది.

అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ (10) క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసినా అద్భుతమైన క్యాచ్ తో అవుటైంది. మస్రామ్ (6) విఫలమైంది. అనంతరం సుష్మా వర్మ (35) మెరుపులు మెరిపించింది. భారీ షాట్లతో ఆకట్టుకుంది. ఆమెకు జులన్ గోస్వామి (10) నుంచి మంచి సహకారం లభించింది. అనంతరం ఏక్తా బిస్త్ (1) సమన్వయలోపం కారణంగా అవుటైంది. జోషి (4), పూనమ్ యాదవ్ (6) నాటౌట్ గా నిలిచారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నస్రా సంధు నాలుగు వికెట్లతో రాణించగా, సైదా యూసుఫ్ రెండు వికెట్లతో, అస్మవి ఇక్బాల్, డైనా బేగ్ ఒక్కో వికెట్ తో సహకరించారు.

More Telugu News