: నిజాంపేట్ నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థుల విధ్వంసం!

హైదరాబాదు, నిజాంపేట్ లోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. ఔటింగ్ విషయంలో కళాశాల యాజమాన్యం, విద్యార్థుల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో విద్యార్థులు మూకుమ్మడిగా ఫర్నిచర్, లైట్లు, పైపు లైన్లను ధ్వసం చేశారు. భోజనం బాగుండడం లేదని, బెడ్ సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. దీంతో అర్ధరాత్రి కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వచ్చిన పోలీసులపై కూడా విద్యార్థులు రాళ్లు విసిరినట్టు తెలుస్తోంది.

దీనిపై పోలీసులు మాట్లాడుతూ, ఔటింగ్ కు వెళ్లాలన్నా, లీవ్ కావాలన్నా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చెప్పించుకోవచ్చని, అలా చేయకుండా కళాశాలలో విధ్వంసం సృష్టించడం ఎంతవరకు సమంజసమో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, లెక్చరర్లు ఆలోచించాలని చెప్పారు. ఈ ముగ్గురూ సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తేనే మెరుగైన సమాజం నిర్మితమవుతుందని, ఇలా పిల్లలు చిన్న విషయాలకే విధ్వంసానికి దిగితే వారి భవిష్యత్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని, వారిని సరైన దారిలో నడిపించాలని సూచించారు. 

More Telugu News