: ఓ తండ్రి క్షమాగుణం.. తన కొడుకును హత్య చేసిన వారిని వదిలేయమని కోర్టును కోరిన వైనం!

ఓ తండ్రి పెద్ద మనసు చూపాడు. తన కొడుకును హత్య చేసిన దోషులను వదిలేయమని కోర్టుకు విన్నవించాడు. వారు కూడా తనకు కొడుకుల్లాంటి వారేనని, వారిని విడిచిపెట్టాలని అభ్యర్థించి తనలోని క్షమాగుణాన్ని చాటుకున్నాడు. అతడి అభ్యర్థనను మన్నించిన కోర్టు ప్రొబేషన్‌పై నలుగురు దోషులను వదిలిపెట్టింది. వారికి ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష పడాల్సి ఉండగా అతడి క్షమాభిక్షతో బయటపడ్డారు. దోషులు నలుగురూ హత్యకు గురైన యువకుడి తండ్రిని క్షమాపణలు వేడుకున్నారని, అతడు క్షమించాడని కోర్టు పేర్కొంది. దోషులు సంస్కరించబడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని, వారు సద్వినియోగం చేసుకోవాలని కోర్టు పేర్కొంది.

రాహుల్, సంజీవ్, దీపక్, రాజాలు ఢిల్లీలోని గ్రామ సేవ వాహనాల డ్రైవర్లు. పార్కింగ్ దగ్గర గొడవ కారణంగా ఏప్రిల్ 28, 2012లో సన్నీ అనే మరో డ్రైవర్‌తో గొడవపడి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సన్నీ మూడు రోజుల చికిత్స తర్వాత ఆస్పత్రిలో కన్నుమూశాడు. ఈ కేసులో వాదోపవాదాలు పూర్తయిన తర్వాత నలుగురినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. శిక్షలు విధించాల్సి ఉండగా సన్నీ తండ్రి క్షమాభిక్షతో అనూహ్యంగా బయటపడ్డారు. బాధితుడి తండ్రి విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులు ఒక్కొక్కరు రూ.1.5 లక్షలు చొప్పున మొత్తం రూ.6 లక్షలు అతనికి చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాగే ప్రొబేషన్ బాండ్ కింద రూ.25 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇక నుంచైనా మంచి పౌరులుగా జీవించాలని ఆదేశించింది.

More Telugu News