: భారత్‌ను ఎగతాళి చేసిన విజయ్ మాల్యా.. బిలియన్ పౌండ్ల గురించి కలలు కనాలంటూ సూచన!

భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా భారత్‌ను ఎగతాళి చేస్తూ అవమానించేలా మాట్లాడారు. మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న పిటిషన్‌పై మంగళవారం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగిన విచారణకు మాల్యా హాజరయ్యారు. అనంతరం కోర్టు బయట విలేకరులు అడిగిన ప్రశ్నలకు కాస్తంతా కోపంగా బదులిచ్చారు.

‘‘నాపై మోపిన అన్ని ఆరోపణలను నేను వ్యతిరేకిస్తూనే ఉంటా. రుణాలను నేను దారి మరల్చలేదు. మీకు నిజాలు తెలియవు. మీరు బిలియన్ పౌండ్ల కోసం కలలు కంటూ ఉండండి. ఈ విషయంలో మీరు నన్నేమీ చేయలేరు. నేను దోషిని కాదని నిరూపించేందుకు నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి’’ అని ఒకింత ఆవేశంగా వ్యాఖ్యానించారు.

కాగా, ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంలో భారత్ ఆలస్యం చేస్తోందని పేర్కొన్న చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్‌నోట్ .. మాల్యా బెయిలును డిసెంబరు 4 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. తదుపరి విచారణ వచ్చే నెల 6న జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో భారత్ తరపున బ్రిటన్‌కు చెందిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదనలు వినిపిస్తోంది.

More Telugu News