: విమానాల ద్వారా 4 వేల ఆవులను దిగుమతి చేసుకుంటున్న ఖతార్!

ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ఉన్న‌ ఖతార్ ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కుంటున్న విష‌యం తెలిసిందే. ఆ దేశం ఉగ్ర‌వాదానికి ఊత‌మిచ్చేలా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని దానితో సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌, ఈజిప్టు తదితర దేశాలు అన్ని ర‌కాల సంబంధాల‌ను తెంచుకున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఆ దేశంలో నిత్యావ‌స‌ర స‌రుకుల కొర‌త ఏర్ప‌డింది. ఒక్క ఇరాన్ మాత్రం ఆ దేశం పట్ల సానుభూతి తెలుపుతూ ప్రతి రోజు విమానాల్లో నిత్యావసర వస్తువులను అందిస్తోంది. కాగా, త‌మ దేశంలోకి 60 విమానాల ద్వారా ఏకంగా నాలుగు వేల ఆవుల‌ను దిగుమ‌తి చేసుకోవాల‌ని ఖ‌తార్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.

ఆ దేశానికి చెందిన పారిశ్రామికవేత్త మౌతాజ్‌ అల్‌ ఖయ్యత్ ఆస్ట్రేలియా నుంచి ఆవులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాడు. నౌక‌ల్లో తీసుకురావాలంటే స‌మ‌యం అధికంగా ప‌డుతుంది కాబ‌ట్టి విమానాల ద్వారానే వాటిని దిగుమ‌తి చేసుకోనున్నారు. త‌ద్వారా సెప్టెంబరు కల్లా దేశీయంగానే పాల దిగుబడిని పెంచాలని భావిస్తున్నారు. 2022లో ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ క్రీడలను ఖతార్‌లో నిర్వహించనున్న నేప‌థ్యంలో అన్ని సవాళ్లను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవాల‌ని యోచిస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూస్తామ‌ని ఖ‌తార్ స‌ర్కారు ప్ర‌క‌టించింది.

More Telugu News