: తొలి వికెట్ తీసిన అశ్విన్...ఆమ్లా అవుట్...డికాక్ మళ్లీ బతికిపోయాడు

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి బ్రేక్ ఇచ్చాడు. ఓవల్ లో జరుగుతున్న ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్లు క్వింటన్ డికాక్ (42), హషీమ్ ఆమ్లా (35) శుభారంభం ఇచ్చారు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు టీమిండియా బౌలర్లను అద్భుతంగా అడ్డుకున్నారు. లైన్ అండ్ లెంగ్త్ తో చక్కటి బంతులు వేసినా, ఐపీఎల్ లో ఆడిన అనుభవంతో వారిద్దరూ చాకచక్యంగా పరుగులు సాధించారు.

ఈ క్రమంలో సుమారు 17 ఓవర్లు వారిద్దరూ క్రీజులో నిలదొక్కుకున్నారు. అయితే 18వ ఓవర్ తొలి బంతిని బౌండరీగా మలచిన ఆమ్లా, తరువాతి బంతిని డిఫెన్స్ ఆడి, మూడో బంతిని భారీ షాట్ గా మలచే ప్రయత్నం చేశాడు. అయితే అశ్విన్ సంధించిన బంతి బ్యాటును ముద్దాడుతూ ధోనీ చేతుల్లో వాలింది. దీంతో ఆమ్లా అవుటయ్యాడు. తరువాతి బంతిని ఆడేందుకు డికాక్ ముందుకు వచ్చాడు. అయితే ధోనీ బంతిని పట్టుకోకపోవడంతో స్టంప్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో డికాక్ కు డుప్లెసిస్ (7) జతకలిశాడు. 20 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది.

More Telugu News