: టీఆర్ఎస్ ఎంపీ కేకే కొన్న భూములు అక్రమమే... సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో అక్రమ భూముల లావాదేవీల వ్యవహారం టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు మెడకు చుట్టుకుంది. ఆయన కుటుంబం గోల్డ్ స్టోన్ భూములను పెద్దఎత్తున కొనుగోలు చేసిన విషయంలో అక్రమాలు జరిగాయని విచారణలో వెల్లడి కాగా, సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇబ్రహీంపట్నం, దండుమైలారం సర్వే నంబర్ 36లో కేకే కుటుంబం 38 ఎకరాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అటవీ శాఖ అధీనంలోని భూములను తనవిగా చెప్పుకున్న గోల్డ్ స్టోన్ పార్థసారథి సహా మరో 17 మంది వాటిని కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి, ఆయన కోడలు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.

ఈ భూములను సబ్ రిజిస్ట్రార్ ఖాదిర్, పత్రాలను పరిశీలించకుండానే రిజిస్టర్ చేశారు. ఈ లావాదేవి ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషనేనని తేల్చిన సర్కారు, సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేసింది. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పింది. కాగా, ఈ భూముల పత్రాలను పరిశీలించిన మీదటే తాము కొనుగోలు చేశామని, ఇవి ప్రభుత్వానివి కావని కేకే వెల్లడించడం గమనార్హం. తొలుత సబ్ రిజిస్ట్రార్ వీటిని రిజిస్టర్ చేయబోమని చెప్పగా, తాము హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకు వచ్చి రిజిస్టర్ చేయించుకున్నామని వెల్లడించారు.

More Telugu News