: భారత హాకీ లెజెండ్‌ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న.. ప్రభుత్వానికి లేఖ రాసిన క్రీడా మంత్రిత్వశాఖ

క్రీడల్లో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్‌కు భారత అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ఇవ్వాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి క్రీడా మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 1928, 1932, 1936లో వరుసగా మూడుసార్లు ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు సాధించి పెట్టిన ధ్యాన్‌చంద్‌ను భారతరత్నతో సత్కరించాలని ప్రభుత్వాన్ని కోరడం ఇదే తొలిసారి కాదు.

 2013లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అప్పటి యూపీఏ ప్రభుత్వం భారతరత్న కోసం ఎంపిక చేసింది. ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడు సచినే. అయితే 2011లో ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలన్న 82 మంది పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. కాగా, ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలంటూ లేఖ రాసిన విషయం వాస్తవమేనని క్రీడా శాఖామంత్రి విజయ్ గోయల్ తెలిపారు. ధ్యాన్‌‌చంద్‌కు భారతరత్న పురస్కారాన్ని తరచూ నిరాకరిస్తుండడంపై  భారత హాకీ మాజీ కెప్టెన్లు అశోక్ కుమార్ (ఈయన ధ్యాన్ చంద్ కుమారుడు), అజిత్‌పాల్ సింగ్, జాఫర్ ఇక్బాల్, దిలీప్ టిర్కీ తదితర వందమంది మాజీ ఆటగాళ్లు గతేడాది నిరసన వ్యక్తం చేశారు.

More Telugu News