: ఏపీలో 12 చోట్ల ‘అగ్రిగోల్డ్’ స్థిరాస్తులు వేలం వేస్తాం: సీఐడి డీజీ ద్వారకా తిరుమలరావు

ఏపీలో 12 చోట్ల వున్న ‘అగ్రిగోల్డ్’ స్థిరాస్తులను వేలం వేస్తామని సీఐడి డీజీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఈ-పోర్టల్ ద్వారా అమ్మకానికి బిడ్ల ద్వారా ఆహ్వానం పలుకుతున్నామని, వేలం వేయనున్న ఆస్తులను ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు సందర్శించవచ్చని, ప్రాథమిక దరావత్తు చెల్లించేందుకు గడువు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4.30 గంటల వరకు ఉందని చెప్పారు. ప్రాథమిక దరావత్తుగా ప్రతి ఆస్తికి రూ.2 లక్షలు చెల్లించాలని, అన్ని ఆస్తులకు బిడ్ల కనీస ప్రారంభ ధర రూ.10 లక్షలుగా నిర్ణయించామని చెప్పారు.

ఈ నెల 20న ఆన్ లైన్ లోనే బిడ్లు దాఖలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వేలానికి నిర్ణయించిన అగ్రిగోల్డ్ స్థిరాస్తుల వివరాలను ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా రామన్నగూడెంలో 31.49 ఎకరాల వ్యవసాయ భూమి, ఒంగోలులో 377.33 చదరపు గజాల ఆర్సీసీ భవనం, ప్రకాశం జిల్లా వీరరామాపురంలో 36.85 ఎకరాల వ్యవసాయ భూమి, విజయవాడ గుణదలలోని నాలుగు నివేశనా స్థలాలు, కర్నూలు జిల్లా కలుగొట్లలో 24.23 ఎకరాల వ్యవసాయ భూమి, నెల్లూరు జిల్లా పొదలకూరులో 21.02 ఎకరాల నివేశనా వెంచర్, విజయవాడలో 2,284.60 చదరపు గజాల వ్యాపార స్థలానికి వేలం నిర్వహించనున్నట్టు చెప్పారు.

More Telugu News